ఎక్స్పైరీ పాల ప్యాకెట్ల అమ్మకంపై ఆగ్రహం

ఎక్స్పైరీ పాల ప్యాకెట్ల అమ్మకంపై ఆగ్రహం

జైనూర్, వెలుగు: ఆసిఫాబాద్​జిల్లా జైనూర్ మండలంలోని మార్లవాయిలో కాలం చెల్లిన పాల ప్యాకెట్ల అమ్మకంపై గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తక్షణ చర్యలు తీసుకోవాలని శుక్రవారం తహసీల్దార్ ఆడ భీర్షవ్ కు నాయకులు వినతిపత్రం అందజేశారు. ఆదివాసీ పోరాట సమితి తుడుం దెబ్బ మండలం అధ్యక్షుడు మధురాజ్ మడావి మాట్లాడుతూ.. ఉదయం గ్రామానికి వచ్చిన ఓ పాల వ్యాపారి కాలం చెల్లిన ప్యాకెట్లు అమ్ముతున్నట్లు గ్రామస్తులు గుర్తించారు. పాల ప్యాకెట్‌ గడువు ముగిసి నాలుగు రోజులైనట్లు ఓ మహిళ గుర్తించి గ్రామస్తులకు తెలిపిందన్నారు. 

సదరు వ్యాపారిని వివరాలు అడగ్గా స్పష్టత ఇవ్వకుండా అక్కడి నుంచి ఉడాయించినట్లు తెలిపారు. ఈ అంశంపై దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకోవాలన్నారు. రాజ్ గొండ్ సేవా సమితి మండల అధ్యక్షుడు రాజేందర్, తుడుందెబ్బ నాయకులు ఆత్రం మూతిరాం, అర్క యుగేందర్, కుముర విజయ్, మిశ్రమ రాజు, సోనేరావు, వాసుదేవ్, రాజేందర్, హనుమంతు, మాణిక్ రావు పాల్గొన్నారు.