ప్రభుత్వ సెంటర్లలో వ్యాక్సిన్​ కష్టాలు

ప్రభుత్వ సెంటర్లలో వ్యాక్సిన్​ కష్టాలు
  • ప్రీ రిజిస్ట్రేషన్ లేకపోవడంతో సెంటర్ల వద్ద పెరుగుతున్న క్యూలు
  • స్టాక్ ఏ రోజు ఉంటుందో.. ఏ రోజు ఉండదో తెలియని పరిస్థితి
  • ప్రైవేట్ సెంటర్లకు పరుగులు పెడుతున్న జనం 
  • ఇప్పటికి నాలుగోవంతు మందికి ప్రైవేట్ టీకాలు
     

ఖమ్మం, వెలుగు: కరోనా థర్డ్ వేవ్​వస్తుందనే హెచ్చరికలు, లాక్​ డౌన్​ ఎత్తేసిన తర్వాత కూడా వస్తున్న పాజిటివ్​ కేసులను చూసి కొవిడ్ వ్యాక్సిన్​ కోసం జనం పరుగు తీస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టీకా కోసం ఉదయం నుంచే క్యూ కడుతున్నారు. వ్యాక్సిన్​కు ఒక్కసారిగా డిమాండ్​ పెరగడం, వచ్చినవాళ్లకు వచ్చినట్లు టీకా ఇచ్చేలా ప్రభుత్వ కేంద్రాల్లో వ్యాక్సిన్​అందుబాటులో లేకపోవడంతో జనం పరేషాన్ అవుతున్నారు. రోజుకు కొన్ని టోకెన్లు మాత్రమే ఇచ్చి, మిగిలిన వాళ్లను తిప్పి పంపుతుండడంతో ఒకటికి రెండు సార్లు తిరగలేక కొందరు, అక్కడ రద్దీని చూసి భయంతో కొందరు ప్రైవేట్ సెంటర్ల వైపు వెళ్తున్నారు. 

25 శాతం మంది ప్రైవేట్​లోనే.. 
రాష్ట్రవ్యాప్తంగా 958 ప్రభుత్వ, 77 ప్రైవేట్ సెంటర్లలో వ్యాక్సినేషన్​డ్రైవ్​ నడుస్తోంది. ఇప్పటివరకు స్టేట్​వైడ్​కోటి 8 లక్షల మంది వ్యాక్సిన్​ తీసుకున్నారు. ఇందులో 25.38 లక్షల మంది ప్రైవేట్ కేంద్రాల్లో టీకా వేయించుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల కంటే ప్రైవేట్ ఆస్పత్రులకు ఆలస్యంగా వ్యాక్సిన్​ అందుబాటులోకి వచ్చినా, ప్రైవేట్ లో కొవిషీల్డ్ ఒక్క డోస్​ రూ.800, కోవ్యాక్సిన్​రూ.1,400 గా ధర నిర్ణయించినప్పటికీ నాలుగోవంతు మంది ప్రైవేట్ వ్యాక్సిన్​ వేయించుకోవడం గమనార్హం. ప్రభుత్వపరంగా వ్యాక్సినేషన్​డ్రైవ్​ స్లోగా సాగుతుండడం, స్లాట్​బుకింగ్​సిస్టమ్​లేకపోవడం, సెంటర్​దాకావెళ్తే టీకా దొరుకుతుందో లేదో తెలియకపోవడం లాంటి కారణాల వల్లే ప్రైవేట్​వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. 

అంతా గందరగోళం
రాష్ట్రంలో వ్యాక్సినేషన్​డ్రైవ్​ ప్రారంభమైన కొత్తలో ప్రతి ఒక్కరూ ఆన్ లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆఫీసర్లు సూచించారు. దీంతో మొదట్లో కొవిన్ యాప్ లో గానీ, వెబ్ సైట్ పోర్టల్ లో గానీ ఆధార్ వివరాల ద్వారా ప్రీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాక ఆధార్ కార్డు ప్రూఫ్ తో ప్రభుత్వ వ్యాక్సినేషన్ సెంటర్లకు వచ్చి టీకా వేయించుకున్నారు. కానీ కొద్దిరోజులుగాఈ ప్రీ రిజిస్ట్రేషన్ అవసరం లేదని, ఆధార్ కార్డుతో డైరెక్ట్ గా వ్యాక్సినేషన్ సెంటర్లలోనే రిజిస్టర్ చేయించుకోవచ్చని ప్రకటించారు. దీంతో అప్పటి నుంచే జనాలకు కష్టాలు మొదలయ్యాయి. ఒక్కో పీహెచ్​సీ పరిధిలో100, పెద్దాసుపత్రుల్లో 300 ఆ లోపే టీకాలు వేస్తుండగా, ఒక్కో దగ్గర అంతకు రెండు, మూడు రెట్ల జనం క్యూకడ్తున్నారు. అన్ని సెంటర్లలో లిమిటెడ్​స్టాక్ అందుబాటులో ఉండడం,  ఏ రోజు ఎంత వ్యాక్సిన్ ఉంటుందో తెలియకపోవడంతో హెల్త్​స్టాఫ్​కూడా జనాలకు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు.  కొన్ని సందర్భాల్లో వ్యాక్సిన్ నిల్వలు లేకపోవడం తో ఉన్నట్టుండి టీకాల పంపిణీ నిలిపివేస్తున్నారు. గత నెలలో కొద్దిరోజుల పాటు సెకండ్ డోస్ వాళ్లకు మాత్రమే టీకాలిచ్చి, ఫస్ట్ డోస్ వాళ్లకు పంపిణీ నిలిపివేశారు. ఆ తర్వాత ప్రభుత్వ డిపార్ట్ మెంట్ల వారీగా కొవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్ పేరుతో కొందరికి, సూపర్ స్ప్రెడర్స్ పేరుతో కొందరికి వ్యాక్సిన్ అందించారు. కామన్​ పీపుల్​ విషయంలో మొదటి నుంచీ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. ఇలాంటి చిక్కుల కారణంగా చాలా మంది ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ తీసుకునేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.

ప్రైవేట్​లో వ్యాక్సిన్​వేయించుకున్నా
వ్యాక్సిన్​వేసుకునేందుకు రెండుసార్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లా. అక్కడ ముందు గానే టోకెన్లు అయిపోయాయని చెప్పారు. రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల పీహెచ్​సీలో వ్యాక్సిన్​ దొరకలేదు. అక్కడ లైన్ లో నిల్చుని వ్యాక్సిన్​ తీసుకోవాలంటే భయమేసింది. అందుకని ప్రైవేట్ లో రిజిస్టర్​ చేయించుకొని రూ.800తో అక్కడే వ్యాక్సిన్​ వేయించుకున్నా. 
- జి.నిర్మల, ఖమ్మం

అందరికీ వ్యాక్సిన్​ అందిస్తాం
జిల్లాలో వ్యాక్సిన్​కొరత లేదు. ప్రభుత్వం ద్వారా ఎప్పటికప్పుడు స్టాక్​ తెప్పిస్తు న్నాం. వ్యాక్సిన్​ కోసం ఎవరూ టెన్షన్​ పడొద్దు. వ్యాక్సినేషన్​ కేంద్రాల్లో గుంపులుగా చేరాల్సిన అవసరం కూడా లేదు. ఫిజికల్​డిస్టెన్స్​పాటిస్తూ వ్యాక్సిన్​ తీసుకోవాలి. విదేశాలకు వెళ్లే వారికి ప్రత్యేక సెంటర్​ ద్వారా వ్యాక్సిన్​ వేస్తున్నాం.  
‌‌‌‌- డాక్టర్​ మాలతి, డీఎంహెచ్ఓ, ఖమ్మం