వ్యాక్సిన్ల తయారీ స్పీడప్..

వ్యాక్సిన్ల తయారీ స్పీడప్..
  • ‘క్వాడ్‌‌’ వ్యాక్సిన్ ప్రోగ్రామ్‌‌లో భాగంగా ముందుకొచ్చిన యూఎస్ ప్రభుత్వం
  • 2022 చివరికల్లా 100 కోట్ల డోసులకు పెరగనున్న బీఈ కెపాసిటీ

హైదరాబాద్‌‌, వెలుగు: ఫార్మా కంపెనీ బయోలాజికల్-–ఈ (బీఈ) వ్యాక్సిన్ తయారీ కెపాసిటీని మరింత  పెంచేందుకు యూఎస్ ప్రభుత్వం  50 మిలియన్ డాలర్ల (రూ. 375 కోట్ల) ఆర్థిక సహకారాన్ని ప్రకటించింది.  ఇంటర్నేషనల్ డెవలప్‌‌మెంట్‌‌ ఫైనాన్స్‌‌ కార్పొరేషన్ (డీఎఫ్‌‌సీ) ద్వారా ఈ ఫండ్స్‌‌ను అప్పుగా ఇచ్చింది.  బయోలాజికల్‌‌–ఈ ఎండీ దాట్ల మహిమ, డీఎఫ్‌‌సీ సీఓఓ డేవిడ్‌‌ మార్చిక్‌‌  అగ్రిమెంట్‌‌పై సోమవారం సంతకాలు చేశారు.  ఈ ఏడాది మార్చిలో వర్చువల్‌‌ ‘క్వాడ్‌‌’ మీటింగ్‌‌లో  ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్‌‌, యూఎస్‌‌ఏలు వ్యాక్సిన్‌‌ పార్టనర్‌‌‌‌షిప్‌‌ను కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ పార్టనర్‌‌‌‌షిప్‌‌లో భాగంగా వ్యాక్సిన్‌‌ తయారీకి యూఎస్‌‌ఏ ఫైనాన్షియల్ సపోర్ట్‌‌ను అందిస్తోంది. ఇండియాలో వ్యాక్సిన్లను తయారు చేసి  ఇండో–పసిఫిక్ రీజియన్‌‌లోని దేశాలకు ఎగుమతి చేస్తారు. వ్యాక్సిన్ల సేకరణను జపాన్‌‌ చూసుకుంటుంది. వీటిని వివిధ దేశాలకు రవాణా చేయడాన్ని ఆస్ట్రేలియా చూసుకుంటుంది. 
వ్యాక్సిన్ల ఎగుమతి పెరుగుతుంది..
డీఎఫ్‌సీ ఆర్థిక సహకారంతో బయోలాజికల్–ఈ వ్యాక్సిన్ తయారీ సామర్ధ్యం వచ్చే ఏడాది చివరి నాటికి ఏడాదికి బిలియన్ డాలర్ల (100 కోట్ల) డోసులకు పెరుగుతుంది. యూఎస్ ఫార్మా కంపెనీ జాన్సన్‌‌ అండ్ జాన్సన్‌‌తో బయోలాజికల్‌‌–ఈ పార్టనర్‌‌‌‌షిప్‌‌ కుదుర్చుకున్న విషయం తెలిసిందే. జాన్సన్‌‌ అండ్ జాన్సన్‌‌ వ్యాక్సిన్‌‌ను  హైదరాబాద్‌‌ ప్లాంట్‌‌లో కంపెనీ తయారు చేస్తోంది.  రెగ్యులేటరీ అనుమతులు వచ్చినప్పటికీ, ఈ  వ్యాక్సిన్‌‌  జనాలకు ఇంకా అందుబాటులోకి రాలేదు.  ఈ ఈవెంట్‌‌లో హైదరాబాద్​లోని యూఎస్‌‌ కాన్సుల్‌‌ జనరల్ జో రైఫ్‌‌మన్‌‌, జపాన్​ కాన్సుల్‌‌ జనరల్‌‌ టాగా మసయుకి, ఆస్ట్రేలియన్ కాన్సుల్ జనరల్‌‌ సారా కిర్లేవ్‌‌ పాల్గొన్నారు. బయోలాజికల్–ఈ ఎండీ మహిమ దాట్ల, ఎక్స్‌‌టర్నల్‌‌ అఫైర్స్‌‌ మినిస్ట్రీ జాయింట్‌‌ సెక్రటరీ వాణి రావు, తెలంగాణ ఇండస్ట్రీస్ మినిస్ట్రీ ప్రిన్సిపల్‌‌ సెక్రెటరీ  జయేష్‌‌ రంజన్ పాల్గొన్నారు. బయోలాజికల్‌‌–ఈ తయారు చేసే వ్యాక్సిన్లను ముఖ్యంగా ఇండో–పసిఫిక్ రీజియన్ దేశాలకు ఎగుమతి చేస్తారు. 
నవంబర్‌‌‌‌లో వ్యాక్సిన్ కోబెవాక్స్‌‌..
బయోలాజికల్–ఈ డెవలప్ చేసిన కరోనా వ్యాక్సిన్ కోబెవాక్స్‌‌  వచ్చే నెల చివరి నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.  10 కోట్ల డోసులతో ఈ వ్యాక్సిన్‌‌ను లాంచ్ చేస్తామని మహిమ దాట్ల పేర్కొన్నారు. ఇప్పటికే తయారు చేసిన డోసులను హిమాచల్ ప్రదేశ్‌‌లోని సెంట్రల్ డ్రగ్స్ లేబోరేటరీకి పంపామని చెప్పారు. ప్రస్తుతం కోబెవాక్స్‌‌పై ఫేజ్ 3 ట్రయల్స్ జరుగుతున్నాయి. ఈ ట్రయల్స్‌‌ నవంబర్‌‌‌‌లో పూర్తవుతాయని, ఆ తర్వాత డ్రగ్స్ రెగ్యులేటరీ అప్రూవల్‌‌ కోసం అప్లికేషన్‌‌ పెట్టుకుంటామని మహిమ అన్నారు. చిన్న పిల్లల కోసం కూడా వ్యాక్సిన్‌‌ను తీసుకొస్తామని చెప్పారు.
తెలంగాణలో లైఫ్‌‌ సైన్సెస్‌‌కు పెద్ద పీట..
రాష్ట్ర ప్రభుత్వం లైఫ్‌‌ సైన్సెస్‌‌ సెక్టార్‌‌‌‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని జయేష్‌‌ రంజన్ అన్నారు. హైదరాబాద్‌‌లో ఏడాదికి 6 బిలియన్ వ్యాక్సిన్లు తయారవుతున్నాయని పేర్కొన్నారు. దేశ ఫార్మా ఎగుమతుల్లో హైదరబాద్‌‌ వాటా 50 శాతంగా ఉంటుందని, దీన్ని మరింత పెంచాలని చూస్తున్నామని అన్నారు. మెడికల్ డివైజ్‌‌ల సెగ్మెంట్‌‌కు కూడా ప్రాధాన్యం ఇస్తున్నామని, ఈ సెగ్మెంట్‌‌ కోసం సిటీకి వెలుపల ఇండస్ట్రియల్ పార్క్‌‌ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర లైఫ్‌‌ సైన్సెస్‌‌ మార్కెట్‌‌ 50 బిలియన్ డాలర్లు (రూ. 3.75 లక్షల కోట్లు) గా ఉందని, 2030 నాటికి ఈ వాల్యూని 100 బిలియన్ డాలర్ల (రూ. 7.5 లక్షల కోట్ల) కు పెంచుతామని చెప్పారు. ఇందులో భాగంగా 4 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 20 వేల ఎకరాలలో ఫార్మా సిటీని ఏర్పాటు చేయనుందని, దీనికి సంబంధించిన విషయాలు త్వరలో వెల్లడిస్తామన్నారు.