ప్రైవేట్ హాస్పిటళ్ల వ్యాక్సిన్ కొనుగోళ్లపై కేంద్రం కొత్త రూల్స్

ప్రైవేట్ హాస్పిటళ్ల వ్యాక్సిన్ కొనుగోళ్లపై కేంద్రం కొత్త రూల్స్

న్యూఢిల్లీ: ఇకపై కరోనా వ్యాక్సిన్లను ప్రైవేట్ హాస్పిటళ్లు నేరుగా తయారీ కంపెనీల నుంచి కొనుగోలు చేయలేవు. కేవలం కొవిన్ యాప్‌లో రిజిస్టర్‌‌ చేసుకుని మాత్రమే ఆర్డర్ పెట్టాలి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కొత్త గైడ్‌లైన్స్ జారీ చేసింది. కొనుగోలు విధానంపై కంట్రోల్ పెట్టడంతో పాటు నెలవారీ మ్యాగ్జిమం డోసుల కొనుగోలుపై లిమిట్ కూడా విధించింది. ఈ కొత్త రూల్స్ జులై 1 నుంచి అమలులోకి తీసుకురానుంది. ప్రైవేట్ హాస్పిటళ్లకు ఇస్తున్న డోసులకు, అవి వేస్తున్న డోసులకు మధ్య చాలా తేడా ఉంటోందని, వ్యాక్సిన్ వేస్టేజ్ ఎక్కువవుతోందని కేంద్రానికి ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ వేస్టేజ్ కంట్రోల్ చేసేందుకు, సప్లైని బ్యాలెన్స్ చేసేందుకు కొత్త రూల్స్ పెడుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.  జూన్‌లో తీసుకున్న వ్యాక్సిన్లు, ఆయా ప్రైవేట్ హాస్పిటళ్లు వేసిన డోసుల సంఖ్య, వేస్టేజ్‌ను బట్టి జులైలో ఎన్ని డోసులు ఇవ్వాలనేది కేంద్రం నిర్ణయిస్తుంది. కొత్తగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో చేరుతున్న ప్రైవేట్ హాస్పిటల్‌కు వారి వద్ద అందుబాటులో ఉన్న బెడ్స్ సంఖ్యను బట్టి డోసులను కేటాయిస్తుంది. ఇందుకోసం అవసరమైన అన్ని వివరాలను ప్రైవేట్ హాస్పిటళ్లు కొవిన్ యాప్‌లో అప్‌లోడ్ చేస్తే, జిల్లాలు, రాష్ట్రాల వారీగా వివరాలను కేంద్రం ప్రభుత్వం టీకా తయారీ కంపెనీలకు అందజేస్తుంది. కేంద్ర నిర్ణయించిన డోసులను బట్టి కంపెనీలు డెలివరీ చేస్తాయి.