వ్యాక్సిన్ సప్లైలోనే సమస్య.. బాధ్యత కేంద్రానిదే

వ్యాక్సిన్ సప్లైలోనే సమస్య.. బాధ్యత కేంద్రానిదే

కంపెనీల నుంచి వ్యాక్సిన్ ఎందుకు కొంటలె?
ఆస్క్‌‌ కేటీఆర్‌‌‌‌లో మంత్రికి పబ్లిక్ ప్రశ్నలు
సీఎం చెప్పిన ఫ్రీ టీకా ఎప్పటికందుతది?
హైదరాబాద్‌‌లోనే కంపెనీలున్నా 
ఎందుకు వెనుకబడ్డామని ట్వీట్లు 
వ్యాక్సిన్​ బాధ్యత కేంద్రానిదేనన్న కేటీఆర్​
ఎక్కువ డబ్బులొస్తయని టీకా కంపెనీలు ప్రైవేటోళ్లకే డోసులు ఇస్తున్నయ్
వ్యాక్సిన్ సప్లైలోనే సమస్య ఉందన్న మంత్రి 

హైదరాబాద్​, వెలుగు: వ్యాక్సిన్ కంపెనీల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వ్యాక్సిన్ కొంటలేదని ‘ఆస్క్‌‌ కేటీఆర్’లో మంత్రి కేటీఆర్‌‌‌‌ను పబ్లిక్ ప్రశ్నించారు. ఆదివారం ఆయన ట్విట్టర్లో ‘ఆస్క్ కేటీఆర్’ పేరుతో వ్యాక్సినేషన్​పై ప్రజల నుంచి ప్రశ్నలు, సలహాలు కోరారు. వ్యాక్సిన్ కొరత, కంపెనీల నుంచి కొనలేకపోవడం, రాష్ట్రంలో అందరికీ టీకాల కోసం రూ.2500 కోట్ల కేటాయిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించినా ఫ్రీగా టీకా వేయలేకపోవడంపై నెటిజన్లు అనేక ప్రశ్నలు అడిగారు.

వ్యాక్సినేషన్‌‌‌‌‌‌‌‌లో బాధ్యత అంతా కేంద్రానిదే అని, కేంద్రం సరైన పాలసీ తీసుకోలేదని అన్నారు. రాష్ట్రాలకు అవసరమైనన్ని డోసులు రావడం లేదని చెప్పారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోనే వ్యాక్సిన్​ఉత్పత్తి కంపెనీలు ఉన్నా.. ఎందుకు కొనుగోలు చేయలేకపోతున్నారని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. కేంద్రం కంపెనీల నుంచి తన వాటా తీసుకున్నాక మిగిలిన 15 శాతంలో రాష్ట్రాలు, ప్రైవేట్ ఆస్పత్రులు పోటీ పడాల్సి వస్తోందని అన్నారు. కేంద్రం వ్యాక్సిన్ కోసం ఇస్తానన్న రూ.35 వేల కోట్లు ఎటుపోయాయో చెప్పాలన్నారు. కేంద్రం పేరు చెప్పకుండా నేరుగా వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌ తయారీ సంస్థల నుంచి రాష్ట్ర సర్కారు కొనుగోలు చేసి, ప్రజలకు అందిచవచ్చు కదా అని మరో వ్యక్తి ప్రశ్నించగా... ‘నచ్చినా, నచ్చకపోయినా వాస్తవాలు చెబుతున్నా, టెండర్లు పిలిచి వ్యాక్సిన్​నిల్వ చేయకపోవడం, వ్యాక్సిన్లు ఎగుమతి చేయడం, కొన్నింటికి అనుమతి ఇవ్వకపోవడం లాంటివి కేంద్రం తప్పిదాలు’ అని ఆయన అన్నారు. 
ప్రైవేటు వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌ రేట్లపై..
ప్రైవేట్ సెంటర్లలో వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌కు రూ.1400 వరకూ వసూలు చేస్తున్నారని, వాళ్లపై యాక్షన్ తీసుకోరా అని ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రశ్నించారు. దీనిపై స్పందించిన కేటీఆర్​ కేంద్రం ఒక్కొక్కరికి ఒక్కొ ధర నిర్ణయించిందని, కేంద్రం రూ.150కి కొనుగోలు చేస్తోందని, రాష్ట్రాలు కొవిషీల్డ్  రూ.300, కొవాగ్జిన్‌‌‌‌‌‌‌‌ రూ.400కు,  ప్రైవేట్ హాస్పిటల్స్​ రూ.600, రూ.1200 చొప్పున కొనుగోలు చేయాల్సి వస్తోందని చెప్పారు. అయితే ప్రైవేట్​వ్యాక్సిన్ సెంటర్లలో ఎక్కువ రేటు తీసుకోవడంపై మాత్రం కేటీఆర్ మాట్లాడలేదు. ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ సెంటర్ల లెక్కనే ప్రభుత్వం ఎందుకు ఎక్కువ వ్యాక్సిన్లు కొనుగోలు చేయలేకపోతోందని ప్రశ్నించగా.. ప్రైవేటోళ్లు ఎక్కువ రేటుతో కొనుగోలు చేస్తున్నారని, అందుకే ఎక్కువ డబ్బులొస్తాయని వ్యాక్సిన్ కంపెనీలు వారికి అమ్మేందుకే ముందుకొస్తున్నాయని చెప్పారు. అయితే వాళ్లతో సమానంగా అంత రేటు పెట్టి తాము కొనుగోలు చేయలేమని అన్నారు. ఫ్రీ వ్యాక్సినేషన్‌‌‌‌‌‌‌‌ కోసం రూ.2500 కోట్లు కేటాయిస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పినా ఇంకా అందరికీ ఉచితంగా టీకా ఎందుకు అందడం లేదని మరో వ్యక్తి ప్రశ్నించగా.. ‘ఇప్పటికే 65 లక్షల మందికి వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌ వేశాం. త్వరలోనే నీ వంతు వస్తుంది’ అని చెప్పారు. ఇప్పుడు వ్యాక్సిన్ కొనలేకపోవడానికి కారణం కంపెనీల నుంచి 85 శాతం కేంద్రమే తీసుకుంటే, మిగిలిన 15 శాతంలో రాష్ట్రాలు పోటీ పడాల్సి రావడమే అన్నారు. ప్రైవేటోళ్లు అంత ఎక్కువ రేటు ఇచ్చి కొంటున్నప్పుడు, కాంపిటీషన్‌‌‌‌‌‌‌‌లో రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్ ఎలా ప్రొక్యూర్ చేయగలుగుతాయో ఆలోచించాలన్నారు.
పిల్లలపై ట్రయల్స్ నడుస్తున్నయ్
తెలంగాణలో వ్యాక్సిన్ వేస్టేజ్ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇప్పుడు చాలా తక్కువగా ఉందని కేటీఆర్ చెప్పారు. ఒకవేళ థర్డ్ వేవ్ కరోనా వస్తే పిల్లలపై అత్యధిక ప్రభావం చూపుతుందన్న భయాందోళనల నేపథ్యంలో వారికి వ్యాక్సిన్ ఏమైనా అందుబాటులోకి వస్తుందా అన్న నెటిజన్​ప్రశ్నకు వాళ్లపై ప్రస్తుతం ట్రయల్స్ నడుస్తున్నాయని సమాధానమిచ్చారు.
విదేశాల నుంచి తీసుకురావాలి
దేశీయంగా వ్యాక్సిన్ సరఫరా తగినంత లేదని, కేంద్రం అమెరికా, కెనడా, డెన్మార్క్ వంటి దేశాల్లో నిరుపయోగంగా ఉన్న 50 కోట్ల వ్యాక్సిన్లను తెప్పించేందుకు ఆ దేశాలతో వెంటనే చర్చలు ప్రారంభించాలని కేటీఆర్ అన్నారు. ఇతర దేశాలు నిరుడే పెద్ద ఎత్తున కంపెనీలకు వ్యాక్సిన్లు సరఫరా కోసం ఆర్డర్ ఇచ్చాయని, కానీ మన కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో మొదలుపెట్టిందని అన్నారు. అమెరికా, ఇజ్రాయిల్ లాంటి దేశాలు సగానికి పైగా జనాభాకు వ్యాక్సిన్ అందిస్తే మన దేశ వ్యాక్సిన్ ప్రక్రియ కనీసం 10 శాతం కూడా దాటలేదన్నారు. ఆస్ట్రేలియా, అమెరికా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, చైనా లాంటి దేశాలు తమ ప్రజలకు ఫ్రీగా వాక్సిన్ అందిస్తే మన దేశంలో కేంద్ర సర్కారు భిన్నంగా వ్యవహరిస్తోందని అన్నారు. 
10 లక్షల మందికి వ్యాక్సిన్​ వేసే యంత్రాంగం
వాక్సినేషన్ విషయంలో ఏజ్ గ్రూపుల వారీగా నిర్ణయం తీసుకోవడం కొంత అయోమయంగా ఉందని, అందుకే ముందుగా సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్ప్రెడర్లను గుర్తించి టీకా వేయాలని నిర్ణయం తీసుకున్నామని కేటీఆర్ చెప్పారు. 30 లక్షల మంది సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్ప్రెడర్లను గుర్తించి వేగంగా వ్యాక్సినేషన్ చేపడుతున్నామన్నారు. విదేశాల్లో చదువు కోసం వెళ్లేవారి కోసం ప్రత్యేక వ్యాక్సిన్​డ్రైవ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఓల్డ్ ఏజ్ హోమ్‌‌‌‌‌‌‌‌లలోనూ వాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైందన్నారు. రాష్ట్రంలో రోజుకు పది లక్షల మందికి వ్యాక్సిన్ వేసే యంత్రాంగం ఉందని, దురదృష్టవశాత్తు ఆ మేరకు అవసరమైన వ్యాక్సిన్ సరఫరా లేదని చెప్పారు. వ్యాక్సిన్లను సమకూర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని, రాష్ట్రం గ్లోబల్ టెండర్లు పిలిచినా ఒక్క కంపెనీ నుంచీ స్పందన రాలేదని కేటీఆర్ చెప్పారు. అంతర్జాతీయ వ్యాక్సిన్ కంపెనీలు ఒక్కో రాష్ట్రంతో విడిగా సంప్రదింపులు జరిపే కన్నా నేరుగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపేందుకే ఇష్టపడుతున్నాయని అన్నారు.