రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు.. అభినందనల వెల్లువ

రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు.. అభినందనల వెల్లువ

రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్ర  (గాయత్రి రవి) సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటులోని తన కార్యాలయంలో రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు రవిచంద్రతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో  ఎంపీలు నామా నాగేశ్వర రావు, కె.కేశవరావు,  రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఎవరెవరు ఏమన్నారంటే.. 

ఇనుగుర్తి నుంచి ఇంద్రప్రస్థకు తీసుకొచ్చిన కేసీఆర్ కు ధన్యవాదాలు
‘‘ నన్ను ఇనుగుర్తి నుంచి ఇంద్రప్రస్థకు తీసుకొచ్చిన కేసీఆర్‌కు రుణపడి ఉంటాను. పార్టీ కోసం పనిచేస్తున్నాను. ఇంకా పనిచేస్తాను.  స్టేజీ మీద ఉన్నవారిని చూస్తేనే బీసీలు సహా సామాజిక న్యాయం ఎలా ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. కాపు సామాజికవర్గం నుంచి కేసీఆర్ కు హామీ ఇస్తున్నాం. కాపు ఒక మాటిస్తే వెనక్కిపోడు. టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం మా కాపు సామాజికవర్గం మద్దతు పూర్తిగా ఉంటుంది. తెలంగాణకు రావాల్సిన నిధులు, విభజన చట్టంలోని హామీల సాధన కోసం నా ప్రయాణం మొదలుపెడతాను. కేంద్రం 20 అవార్డులు ప్రకటిస్తే 19 తెలంగాణ రాష్ట్రానికే వచ్చాయంటే రాష్ట్రం ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతుందో అర్థం చేసుకోవచ్చు.’’ 
-  వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి), టీఆర్ఎస్ ఎంపీ

కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకున్నారు
‘‘ పేదవర్గాల ప్రతినిధి గాయత్రి రవికి రాజ్యసభ టికెట్ ఇచ్చి కేసీఆర్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సహకరించే వ్యక్తిత్వం గాయత్రి రవి సొంతం. 
వరంగల్, ఖమ్మం జిల్లాల్లో గాయత్రి రవిని చాలా మంది అభిమానిస్తారు. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తోంది. దీనిపై పోరాడుతున్న టీఆర్ఎస్ ఎంపీలకు తోడుగా నిలిచి పోరాడాలని కోరుతున్నాను. కేంద్రం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోతే బండి సంజయ్ ఎవరిపై ధర్నా చేయాలి? రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందిస్తూ ధర్నాలు చేస్తారంటే ఎలా?  ఆంధ్రప్రదేశ్ విషయంలో ఒకలా, తెలంగాణ విషయంలో ఒకలా కేంద్రం వ్యవహరిస్తోంది.’’
-  ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర మంత్రి

రవిచంద్రకు అభినందనలు
‘‘రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన రవిచంద్రను మనసారా అభినందిస్తున్నాను.  వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నేతలు తరలివచ్చారంటే ప్రజల్లో ఆయనకున్న పలుకుబడి ఏంటో తెలుస్తుంది. కేంద్రంపై టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు చేస్తున్న పోరాటంలో రవిచంద్ర కూడా తన వంతు పాత్ర పోషిస్తారని ఆశిస్తున్నాను. రవిచంద్రకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి మించి రాజ్యసభ అవకాశం వచ్చింది. ఇది మంత్రి పదవితో సమానమైన అవకాశం.’’
-  కడియం శ్రీహరి, మాజీ మంత్రి

తెలంగాణపై కేంద్రం చిన్నచూపు 
‘‘విభజన చట్టంలో పొందుపర్చిన బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సహా అనేక ప్రాజెక్టులు అమలు చేయలేదు. రానున్న రోజుల్లో పార్లమెంటు ఉభయ సభల్లో కేంద్ర ప్రభుత్వ అన్యాయాలపై పోరాటం చేస్తాం. ఇదే రాష్ట్రం నుంచి గెలుపొందిన జాతీయ పార్టీల ఎంపీలు రాష్ట్రానికి రావాల్సిన అంశాల గురించి ఏరోజూ మాట్లాడలేదు. ’’
 -  నామా నాగేశ్వర రావు, టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత

మరిన్ని వార్తలు..

సివిల్స్ 2021 ఫలితాలు విడుదల

బ్రెజిల్ను ముంచెత్తిన భారీ వర్షాలు