బ్రెజిల్ను ముంచెత్తిన భారీ వర్షాలు

బ్రెజిల్ను ముంచెత్తిన భారీ వర్షాలు

బ్రెజిల్ లో భారీ వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలతో చాలా చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో చాలా మంది నిరాశ్రయులయ్యారు. కొన్ని చోట్ల ఇండ్లు కూలిపోయాయి. రెసిఫ్ ఏరియాలో వరదల బీభత్సం చాలా ఎక్కువగా ఉంది. వరదలకు ఊళ్లకు ఊళ్లు మునిగిపోయాయి. చాలా చోట్ల జనజీవనం స్థంభించిపోయింది. ఇప్పటి వరకు 44 మంది వరదల్లో చిక్కుకుని చనిపోయినట్లు బ్రెజిల్ అధికారులు తెలిపారు. వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

పెర్నమ్ బుకో స్టేట్ లో ఈ వరదలు విరుచుకుపడ్డాయి. అక్కడ 33 మున్సిపాలిటీల పరిధిలో ఎమర్జెన్సీ విధించారు. చాలా చోట్ల ఇండ్లు కూలిపోవడం, కొండ చరియలు విరిగిపడుతున్న వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. కార్లు నీట మునిగాయి. పెర్నమ్ బుకో ఏరియాలో 23 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. సగటున ఒక నెలలో కురవాల్సిన వర్షం ఒక్కరోజులో పడడంతో ఈ వరద పరిస్థితి తలెత్తింది. మరింతగా వర్షాలు కురిస్తే వరదల పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని బ్రెజిల్ అధికారులు అలర్ట్ అయ్యారు.