వైభవంగా వాగ్గేయకారోత్సవాలు

వైభవంగా వాగ్గేయకారోత్సవాలు
  •     రామదాసు విగ్రహానికి పంచామృతాభిషేకం

భద్రాచలం, వెలుగు : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో భక్తరామదాసు 391వ జయంతి ప్రయుక్త వాగ్గేయకారోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందుగా ఆయన ఫొటోతో గర్భగుడిలో రామదాసు పేరిట కేశవనామార్చనను రామయ్యకు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తరామదాసుకు స్వామి వారి శేషమాలికలు, వస్త్రాలు, ప్రసాదం అందజేశారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న భక్తరామదాసు విగ్రహానికి అర్చకులు పంచామృతాభిషేకం చేశారు.

రామదాసు ఫొటోతో నగర సంకీర్తనను ప్రారంభించారు. ఆలయం నుంచి తొలుత గోదావరి తీరానికి చేరుకుని అక్కడ గోదావరిమాతకు ప్రత్యేక పూజలు చేశారు. పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, పట్టువస్త్రాలు సమర్పించారు. అక్కడ ఈవో రమాదేవి, శ్రీచక్ర సిమెంట్స్ అధినేత నేండ్రగంటి కృష్ణమోహన్​, చిలుకూరి బాలాజీ టెంపుల్​ అర్చకులు రంగరాజన్​, భక్తరామదాసు వారసులు కంచర్ల శ్రీనివాస్​ ఉన్నారు.

అక్కడి నుంచి సంకీర్తనలు చేస్తూ భద్రగిరి చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించారు. తిరిగి చిత్రకూట మండపానికి వచ్చారు. అక్కడ సీతారాముల ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేసి వాగ్గేయకారోత్సవాలు షురూ చేశారు. ప్రముఖ సంగీత విద్వాంసులు మల్లాది సూరిబాబు నేతృత్వంలో ఆయన కుమారులు, దేశం నలుమూలల నుంచి వచ్చిన సంగీత కళాకారులు భక్తరామదాసు రచించిన 9 కీర్తనలతో నవరత్న కీర్తన గోష్టి నిర్వహించారు. భద్రగిరులు పులకించేలా సంగీత వేడుక సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.