?LIVE : Vaikunta Ekadasi : తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు

?LIVE : Vaikunta Ekadasi : తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు
  • తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు
  • ఆలయాల్లో భక్తుల సందడి 
  • ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న ఆలయాలు

వైకుంఠ ఏకాదశి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువ జామున నుంచే ఆలయాలు  భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దేదీప్యమానంగా వెలిగిపోతూ ఆధ్యాత్మిక శోభతో ఆలయాలన్నీ కళకళలాడుతున్నాయి. పవిత్ర పర్వదినం కావడంతో ఆలయాల దర్శనం కోసం భక్తులు వేకువ జాము నుంచే ఆలయాల వద్ద క్యూ కడుతున్నారు.

తిరుమల శ్రీవారి దర్శనం కోసం అర్ధరాత్రి దర్శనాలను ప్రారంభించారు. పలువురు ప్రముఖులను శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల, యాదాద్రి, అన్నవరం, భద్రచలం, ద్వారక తిరుమల, మంగళగిరి, విజయవాడ, అనంతపురం, ధర్మపురి తదితర అన్ని ప్రముఖ ఆలయాలు భక్తజన సంద్రంగా మారాయి.

తిరుమల  శ్రీవారి దర్శనానికి అర్ధరాత్రి 12.05 గంటలకు దర్శనాలను ప్రారంభించారు. ప్రముఖులు,మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ధర్మకర్తల మండలి సభ్యులు దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఉదయం 5 నుంచి 6 గంటల వరకు శ్రీవాణి ద్వారా టోకెన్లు పొందిన భక్తులను దర్శనానికి అనుమతించారు. ఉదయం 6 గంటల నుంచి సామాన్య భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించారు. తిరుమలలో ఈ నెల 11 వరకు వైకుంఠద్వారం ద్వారా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది.

యాదాద్రి భువనగిరి జిల్లా : ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. యాదాద్రిలో మొదటిసారి శ్రీ స్వామివారిని దర్శించుకునేందుకు ఉత్తర ద్వార గుండా దర్శనానికి ఏర్పాట్లు చేయడంతో భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. ఉదయం 6 గంటల 48 నిమిషాలకు భక్తులకు ఉత్తర ద్వార గుండా లక్ష్మీనరసింహుడు భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్తర ద్వార దర్శనంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సునీత పాల్గొన్నారు. 

జగిత్యాల జిల్లా : ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో భక్తులు పొటెత్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ రవి దంపతులు, జెడ్పీ చైర్మన్ వసంత పాల్గొన్నారు. ఉత్తర ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. ఉదయం 2:30 నిమిషాలకు ఆలయ అర్చకులు లక్ష్మీ సమేత యోగ, ఉగ్రనరసింహ, వెంకటేశ్వర స్వామి స్వాముల మూల విరాట్ లకు మహా క్షీరాభిషేకాలు నిర్వహించారు. ఉదయం ఐదు గంటలకు మంగళ వాయిద్యాలతో, వేద మంత్రోచ్ఛారణలతో వైకుంఠ ద్వారాలు తెరిచారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దర్శించుకున్నారు. 

రాజన్నసిరిసిల్ల జిల్లా  : వేములవాడ రాజన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్తర ద్వారం ద్వార భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. అంతకుముందు.. ఆలయ అర్చకులు,అధికారులు ఉత్సవ మూర్తులను ఆలయంలోనే పల్లకి సేవ, పెద్ద సేవలపై మూడు సార్లు ప్రదక్షిణలు చేయించి.. భక్తులకు దర్శనం కల్పించారు. స్వామి వార్లకి మహా హారతి అనంతరం కోడె మొక్కులు, ఆర్జిత సేవలు ప్రారంభించారు. ఉదయమే ఆలయ ప్రధాన అర్చకులు అప్పాల భీమశంకర్ శర్మ ఆధ్వర్యంలోని అర్చకులు శ్రీ స్వామివారికి మహన్యాస పూర్వక ఏకదాశ రుద్రాభిషేకంతో పాటు శ్రీ లక్ష్మీ గణపతికి, శ్రీ రాజరాజేశ్వర దేవి అమ్మవార్లకు, శ్రీ అనంత పద్మనాభ స్వామి వారికి ప్రత్కేక పూజలు నిర్వహించారు.  వివిధ రకాల పూలతో అలంకరించిన అంబారి వాహనంపై శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి,  శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఉత్సవమూర్తులను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత రాజ గోపురం ద్వారా ఉత్సవమూర్తులను బయటకు తీసుకువచ్చి భక్తులకు దర్శనం కల్పించారు. అయితే స్వామి వార్లకి మహా హారతి అనంతరం కోడె మొక్కులు, ఆర్జిత సేవలు అనుమతి ఇచ్చారు.

కరీంనగర్ జిల్లా : చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలోని అతి పురాతనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు.

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అష్టలక్ష్మి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. 

సిద్దిపేట : సిద్దిపేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార స్వామి వారిని మంత్రి హరీష్ రావును దర్శనం చేసుకుని.. స్వర్ణ కిరీటం సమర్పించారు. 

మంచిర్యాల జిల్లా : మంచిర్యాల పట్టణం విశ్వనాథ ఆలయం, మందమర్రి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం గుండా భక్తులు స్వామివార్లను దర్శనం చేసుకుంటున్నారు. ఇటు కరీంనగర్ లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు కొనసాగుతున్నాయి. ఉత్తర ద్వారం ద్వారా భక్తులు స్వామివార్లను దర్శనం చేసుకుంటున్నారు. 

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్మశాల వేంకటేశ్వర ఆలయంలో భక్తులు పోటెత్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని ఉత్తర ద్వారా గుండా దర్శనం చేసుకుంటున్నారు. ఇటు కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ సర్ సిల్క్ కాలనీలోని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయంలో భక్తుల పూజలు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉత్తర ద్వార దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. 

నిజామాబాద్ : జిల్లా వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. తెల్లవారు జాము నుండే ఆలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తోంది. గంగస్థాన్ ఉత్తర తిరుపతి క్షేత్రంలో స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు.

బోధన్ పట్టణం : వెంకటేశ్వరకాలనీలో శ్రీ లక్ష్మి గోదావరి సమేత శ్రీ వెంకటేశ్వర ఆలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. 

వరంగల్ : ముక్కోటి ఏకాదశి పర్వదినం కావడంతో భక్తులతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ఉత్తర ద్వారా దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా : కాళేశ్వరంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు కొనసాగుతున్నాయి. శ్రీ రామాలయంలో ఉత్తరద్వార దర్శనం గుండా స్వామి వారిని భక్తులు దర్శించుకుంటున్నారు. గరుడ వాహనంపై శ్రీ సీతారామ చంద్ర స్వామి భక్తులకు దర్శనమిస్తున్నారు. 

మహబూబ్ నగర్ : కంచి కామకోటిపీఠం పాలమూరు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు కొనసాగుతున్నాయి. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. 

సికింద్రాబాద్ : సీతాఫల్ మండి నామాల గుండులోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు పోటెత్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వైకుంఠ ద్వారం గుండా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. స్వామి వారిని మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు కూడా దర్శించుకున్నారు.

సికింద్రాబాద్ : తిరుమలగిరిలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు పోటెత్తారు. వైకుంఠ ద్వారం గుండా వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటున్నారు. 


హైదరాబాద్ : చందానగర్ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు నిర్వహిస్తున్నారు. భక్తులు ఉత్తర ద్వారం ద్వార స్వామి వారిని దర్శించుకుంటున్నారు.

హైదరాబాద్: వైకుంఠ ఏకాదశి సందర్భంగా జియాగూడాలోని రంగనాథ స్వామి దేవాలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. కలకత్తాకు చెందిన కళాకారులు దేవాలయాన్ని ఎంతో సుందరంగా ముస్తాబు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అంతటి స్థాయిలో ఏర్పాట్లు చేశామని దేవాలయ అర్చకులు తెలిపారు.

ఉప్పల్ స్వరూప్ నగర్ లోని శ్రీ కనిగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో పూజలు చేస్తున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి.