వైశాలి.. ఆమే ఒక బ్రాండ్​

వైశాలి.. ఆమే ఒక బ్రాండ్​

వైశాలి షాడంగులేకి ఫ్యాషన్​ అంటే చాలా ఇష్టం. పోటీ ఎక్కువగా ఉండే డిజైనింగ్​ రంగంలో తన మార్క్​ ఉండాలనుకుంది. భారతీయ సంస్కృతి, ప్రకృతికి అద్దం పట్టే దుస్తులు డిజైన్​ చేయడం మొదలుపెట్టింది. ఆ ప్రత్యేకతే వైశాలిని ప్రపంచానికి పరిచయం చేసింది. వైశాలి మనదేశం నుంచి ప్యారిస్​ ఫ్యాషన్​ వీక్​లో ఎంట్రీ సాధించిన​ మొదటి మహిళా డిజైనర్​గా గుర్తింపు తెచ్చుకుంది. ‘వైశాలి ఎస్’​ ఫ్యాషన్​ బ్రాండ్​ను​ 2011లో మొదలు పెట్టింది. ఆమె డిజైన్లలో భారతీయ కల్చర్​ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. డిజైనర్​గా మొదటి ఏడాదిలోనే ‘విల్స్​ ఇండియా లైఫ్​ స్టైల్​ ఫ్యాషన్​ వీక్​’లో అందరినీ ఇంప్రెస్​ చేసింది వైశాలి. ఈసారి ప్యారిస్​ ఫ్యాషన్​​ వీక్​లో తన కలెక్షన్​ చూపించే అవకాశం వచ్చింది. డిజైనర్​ రాహుల్​ మిశ్రా (2000) తర్వాత మనదేశం నుంచి ప్యారిస్​ ఫ్యాషన్​ వీక్​ ఎంట్రీ  సాధించిన రెండో వ్యక్తి, మొదటి మహిళ వైశాలి కావడం విశేషం. 
తండ్రి నుంచి వారసత్వంగా
వైశాలి సొంతూరు మధ్యప్రదేశ్​లోని విదిశ. వాళ్ల నాన్న ఆర్టిస్ట్​.  వైశాలికి ఆర్ట్​, డిజైనింగ్​ మీద ఇష్టం పెరగడానికి తండ్రే కారణం. టీనేజ్​లోనే డిజైనింగ్​ తన ప్యాషన్​ అని తెలుసుకుంది వైశాలి. డిగ్రీ చదివాక ఫ్యాషన్​ డిజైనింగ్ వైపు వెళ్లాలనుకుంది. కంప్యూటర్ సైన్స్​ కోర్స్ పూర్తవ్వగానే మనదైన ఫ్యాషన్​ మీద అవగాహన కోసం నార్త్​ఈస్ట్, వెస్ట్​ బెంగాల్, కర్నాటకలోని మారుమూల పల్లెలకు వెళ్లింది. ఆ టైంలోనే తన సొంతూరు విదిశకు మూడు గంటల ప్రయాణ దూరంలో ఉన్న ‘ఛందేరి’లోని చేనేత కుటుంబాల నైపుణ్యం చూసింది. కర్నాటకలోని ఖున్​ చేనేత కార్మికుల జీవితాలు కూడా వైశాలిని కదిలించాయి. ‘‘2012లో కర్నాటక బాగల్​కోట్​ జిల్లాలోని ఖున్​ చేనేత కార్మికులను కలిశాను. వాళ్లలో చాలామంది మగ్గాలను మూలన పడేశారు. వాళ్లతో మాట్లాడి, పనితో పాటు పైసలు కూడా ఇప్పిస్తా అని చెప్పాను.  దాదాపు నలభై మందిని తిరిగి మగ్గం పట్టేందుకు ఒప్పించాను” అని చెప్పింది వైశాలి. లోకల్​గా బాగా ఫేమస్​ అయిన ఛందేరి, ఖున్​ వంటి చేనేత దుస్తులకు గ్లోబల్​ గుర్తింపు తెచ్చిపెట్టాలని, ఫ్యాషన్ డిజైన్లకు కేరాఫ్​గా ఉన్న ముంబైకి షిప్ట్​ అయింది. 
ఎన్నో స్ట్రగుల్స్​
ఎన్నో ఆశలతో ముంబైలో అడుగుపెట్టిన వైశాలి మొదట్లో ఆఫీస్​ అసిస్టెంట్​, జిమ్​ ఇన్​స్ట్రక్టర్​... ఇలా చాలా జాబ్స్​ చేసింది.  జిమ్​ ఇన్​స్ట్రక్టర్​గా ఉన్నప్పుడే డిజైనర్​గా తన జర్నీ మొదలైంది. జిమ్​కు వచ్చేవాళ్లకి స్టైలింగ్​ టిప్స్​, వాళ్లకు ఎలాంటి డ్రెస్​లు బాగుంటాయో చెప్పేది. వైశాలికి ఫ్యాషన్​ మీద ఉన్న ఇంట్రెస్ట్​ చూసి ఆమె క్లోజ్​ ఫ్రెండ్​  ప్రోత్సహించింది. అలా  ఫ్రెండ్​ సలహాతో యాభై వేల లోన్​ తీసుకొని ముంబైలోని మలాడ్​లో బొటిక్​ ఓపెన్​ చేసింది వైశాలి.  ఇద్దరు టైలర్లతో మొదలుపెట్టిన ఆ బొటిక్ ఆమె లైఫ్​కి ఒక టర్నింగ్ పాయింట్. అదే టైంలో ఫ్యాషన్​లో కొత్త ఎక్స్​పరిమెంట్స్​ చేయాలి అనుకుంది. ఢిల్లీలోని పెరల్​ అకాడమీలో ఫ్యాషన్​ డిజైనింగ్​ చేసి, తర్వాత ఇటలీలోని మిలాన్​లో మాస్టర్స్​ చదివింది. ఇండియన్​, వెస్టర్న్​ స్టైల్స్​ను మిక్స్​ చేసిన డ్రెస్, చీరలు డిజైన్​ చేయడం తన స్పెషాలిటీ. అలా డిజైనింగ్​లో తనకంటూ ఒక మార్క్​ క్రియేట్​ చేసుకుంది​. న్యూయార్క్​ ఫ్యాషన్​ వీక్​లో కూడా వరుసగా నాలుగేళ్లు  (2016–‌‌2019) తన కలెక్షన్స్​​ ప్రదర్శనకు పెట్టింది వైశాలి. 

నా ఫోకస్​ వాటిమీదే
‘‘డిజైనర్​గా కెరీర్​ ప్రారంభంలో ముంబై, ఢిల్లీకి చాలాసార్లు వెళ్లాల్సి వచ్చేది. దాంతో నా రెండేళ్ల కూతుర్ని మా ఆయన దగ్గర వదిలేసి వెళ్లేదాన్ని. 
నా భర్త నా డ్రీమ్​ని అర్థం చేసుకొని సపోర్ట్​ చేశారు. భారతీయ చేనేత కళకు మోడర్న్​ లుక్​ తేవడం. నేటివిటీని చూపించడం మీదనే నా ఫోకస్​ అంతా. ప్రపంచంలో మన డిజైన్లకు చాలా మంచి పేరుంది. ప్యారిస్​  ఫ్యాషన్​ వీక్​ నాకెంతో స్పెషల్​” అంటోంది వైశాలి.