
టొరంటో: ఇండియా యంగ్ గ్రాండ్ మాస్టర్ ఆర్. వైశాలి.. క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో హ్యాట్రిక్ విజయాలు సాధించింది. శుక్రవారం జరిగిన విమెన్స్ 12వ రౌండ్లో వైశాలి (5.5).. అనా ముజిచుక్ (ఉక్రెయిన్)పై గెలిచింది. తెలుగు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి (6).. గొర్యాచుకినా (రష్యా 6)తో జరిగిన గేమ్ డ్రా అయ్యింది. ఓపెన్ సెక్షన్లో డి. గుకేశ్ 57 ఎత్తులతో అబసోవ్ నిజత్ (అజర్‌బైజాన్ 3)పై నెగ్గాడు. దీంతో ఏడున్నర పాయింట్లతో ఇయాన్ నెపొమినియాట్చితో కలిసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆర్. ప్రజ్ఞానంద (6).. నెపోమ్నియాచి గేమ్ 55 ఎత్తుల వద్ద డ్రా కాగా, ఫ్యాబియానో కరువానా (అమెరికా7)తో జరిగిన గేమ్‌లో గ్రాండ్ మాస్టర్ విదిత్ గుజరాతీ (5) ఓటమిపాలయ్యాడు. ఈ ఇద్దరూ టైటిల్ రేస్ నుంచి దాదాపుగా వైదొలిగారు.