పొగాకు సామ్రాజ్యం విలువ 11,79,498 కోట్లు

పొగాకు సామ్రాజ్యం విలువ 11,79,498 కోట్లు

ఇండియా ఎకానమీలో పొగాకు రంగం ఏకంగా రూ.11,79,498 కోట్లు సమకూరుస్తోంది. ఈ రంగం దేశంలోని 4.57 కోట్ల మందికి ఉపాథి కల్పిస్తోంది. అసోఛామ్‌‌ కోరిక మేరకు థాట్‌‌ ఆర్బిట్రేజ్‌‌ రిసెర్చ్‌‌ ఇన్‌‌స్టిట్యూట్‌‌ (టారి) నిర్వహించిన స్టడీలో ఈ ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఏళ్ల తరబడి పొగాకు రంగం సమకూర్చిన విలువను లెక్క కట్టినట్లు టారి తెలిపింది. ఐతే, టొబాకో వల్ల తలెత్తే ఆరోగ్య సంబంధ సమస్యలను ఈ స్టడీలో పరిగణనలోకి తీసుకోలేదు.  వ్యవసాయం, దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు పొగాకు రంగం విస్తరించి ఉండటం వల్లే, స్టడీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు అసోఛామ్‌‌ తెలిపింది. పొగాకు సాగు చేసే రైతులు, పొలాల్లో పని చేసే వర్కర్లు, ప్రాసెసింగ్‌‌ యూనిట్లు, ట్రాన్స్‌‌పోర్టర్లు, ట్రేడ్‌‌ ఛానెల్స్‌‌, మాన్యుఫాక్చరింగ్‌‌ యూనిట్లు, బ్రాండ్‌‌ ఓనర్ల మొదలు, ఎక్స్‌‌పోర్ట్‌‌ ఆపరేషన్స్‌‌ దాకా వివిధ విభాగాలను స్టడీలో లోతుగా పరిశీలించినట్లు పేర్కొంది. తమ జీవనాధారం కోసం ఇండియాలోని 4.57 కోట్ల మంది పొగాకు రంగం మీద ఆధారపడుతున్నట్లు వివరించింది. ఇందులో 60 లక్షల మంది రైతులు, 2 కోట్ల మంది వ్యవసాయ లేబర్‌‌, 40 లక్షల మంది లీఫ్‌‌ ప్లక్కర్స్‌‌, 85 లక్షల మంది ప్రాసెసింగ్‌‌, మాన్యుఫాక్చరింగ్‌‌, ఎక్స్‌‌పోర్ట్స్‌‌లోని వర్కర్లు, రిటైలింగ్‌‌, ట్రేడింగ్లోని 72 లక్షల మంది వర్కర్లు ఈ పొగాకు రంగంలో పనిచేస్తున్నట్లు స్టడీ తెలిపింది. ఇండియాలోని కమర్షియల్‌‌ పంటలలో అత్యధిక భాగం పొగాకు నుంచే వస్తోందని పేర్కొంది. వ్యవసాయ రంగంలో ఉపాథితోపాటు, రైతులకు మెరుగైన ఆదాయం, ఎక్స్‌‌పోర్ట్స్‌‌ ద్వారా ఫారిన్‌‌ ఎక్స్చేంజ్‌‌ పొగాకు రంగం సమకూరుస్తోందని వెల్లడించింది.

6 వేల కోట్ల ఫారెక్స్….

పొగాకు, పొగాకు సంబంధిత ఉత్పత్తుల ఎగుమతిలో ఇండియా మెరుగైన స్థానంలో ఉన్నట్లు డేటా చెబుతోందని, ఏటా రూ. 6 వేల కోట్ల ఫారిన్‌‌ ఎక్స్చేంజ్‌‌ను ప్రభుత్వానికి తెచ్చిపెడుతోందని టారి స్టడీ రిపోర్టు తెలిపింది. ఐతే, ఇండియా నుంచి ప్రధానంగా పొగాకే ఎక్కువగా ఎగుమతి అవుతోందని, దాని విలువ రూ. 4,173 కోట్లని, సిగార్స్‌‌, షెరూట్స్‌‌, సిగారిలోస్‌‌, సిగరెట్లు కలిపి రూ. 1,830 కోట్ల ఎగుమతి అవుతున్నట్లు పేర్కొంది. వివిధ దేశాలలోని ప్రజల అభిరుచులకు తగిన విధంగా పొగాకును ఇండియా ఉత్పత్తి చేస్తోందని వివరించింది. గ్లోబల్‌‌ పొగాకు (లీఫ్‌‌) వాణిజ్యంలో ఇండియా వాటా అయిదు శాతమని, విలువ పరంగా 12 బిలియన్‌‌ డాలర్లని తెలిపింది. ఇండియా నుంచి 100 దేశాలకు పొగాకు ఎగుమతి అవుతోందని పేర్కొంది. ఇతర పంటలను పండించడానికి పనికిరాని భూముల్లోనే ప్రధానంగా పొగాకు సాగు చేస్తున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా భూసారం తక్కువగా ఉండే భూములలోనే పండిస్తున్నారని తెలిపింది. ఆహార ఉత్పత్తుల సాగుతో పోలిస్తే పొగాకు పంట సాగుకు  ఎక్కువ మందే మనుషులు అవసరమని, కాకపోతే అందుకు తగినట్లుగానే రైతులకు ప్రతిఫలం దొరుకుతుందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌‌, కర్నాటక, గుజరాత్‌‌ రాష్ట్రాలలో ఎక్కువగా పొగాకు పంటను సాగు చేస్తున్నారని తెలిపింది. దేశంలోనే మొదటిసారిగా ఆర్థిక వ్యవస్థలో పొగాకు రంగం  పాత్రను స్టడీ చేసి, గణాంకాలను రూపొందించినట్లు టారి డైరెక్టర్‌‌ క్షమా వి కౌశిక్‌‌ తెలిపారు. వ్యాల్యూ చెయిన్‌‌లో వివిధ వర్గాలకు సమకూరుతున్న ప్రతిఫలాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు చెప్పారు. గతంలో జరిపిన స్టడీలు సోషియో–ఎకనమిక్‌‌ బెనిఫిట్స్‌‌ను పట్టించుకోలేదని, మొదటిసారిగా తామే ఆపని చేసినట్లు తెలిపారు. పొగాకు రంగంలో  ప్యాకేజింగ్‌‌, వేర్‌‌హౌసింగ్‌‌, ఫ్లేవర్‌‌, ఫ్రాగ్రాన్స్‌‌, పేపర్‌‌, జూట్‌‌, మెంథా, అరెకా నట్‌‌, ట్రాన్స్‌‌పోర్టర్లుతోపాటు, సాగుకు అవసరమైన ఫెర్టిలైజర్లు, పెస్టిసైడ్స్‌‌ వంటి విభాగాల పాత్రను మునుపెన్నడూ పరిగణనలోకి తీసుకోలేదని వివరించారు. దాంతో తామే ఇప్పడు సమగ్రమైన స్టడీ నిర్వహించామన్నారు.