రాహుల్​ను ప్రధానిని చేద్దాం : వంశీచంద్ రెడ్డి

రాహుల్​ను ప్రధానిని చేద్దాం : వంశీచంద్ రెడ్డి
  •     సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు ​వంశీ చంద్​రెడ్డి

మక్తల్, వెలుగు: భారత్ జోడోయాత్ర పేరుతో దేశాన్ని ఒక్కటి చేసేందుకు కన్యాకుమారి నుంచి కాశ్మీర్​ వరకు 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన రాహుల్​గాంధీని ప్రధానిని చేసేందుకు ప్రతి కార్యకర్త కష్టపడాలని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్ రెడ్డి సూచించారు. పట్టణంలోని ద్వారకా ఫంక్షన్  హాల్లో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, మధుసూదన్ రెడ్డి, యెన్నం శ్రీనివాసరెడ్డి, అనిరుధ్​రెడ్డి, వీర్లపల్లి శంకర్, యూత్  కాంగ్రెస్  రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వంశీచంద్​రెడ్డి మాట్లాడుతూ సీఎం, రాహుల్ గాంధీ ఆశీస్సులతో రాబోయే పార్లమెంట్  ఎన్నికల్లో మహబూబ్​నగర్  నుంచి ఎంపీగా తాను పోటీ చేస్తున్నానని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మహబూబ్​నగర్  పార్లమెంట్  పరిధిలో ఏడుగురు వజ్రాల్లాంటి ఎమ్మెల్యేలు ఉండడం తన అదృష్టమని, ప్రతి అసెంబ్లీ పరిధిలో మూడు రోజులు పాదయాత్ర చేస్తానని చెప్పారు. మక్తల్  నియోజకవర్గం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తానన్నారు.

పదేండ్లు అధికారం లేకున్నా, అక్రమ కేసులు బనాయించినా, బెదిరించినా పార్టీని నమ్ముకొని ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడుతూ కార్యకర్తల కృషి, అండగా నిలిచిన నాయకులతోనే ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరూ కాంగ్రెస్  పార్టీలోకి వస్తామని తనకు ఫోన్లు చేస్తున్నారని, అలాంటి వారిని పార్టీలోకి తీసుకునే ఉద్దేశం తనకు లేదన్నారు. అంతకుముందు ట్యాంక్​బండ్  నుంచి బైక్ ర్యాలీతో తరలివచ్చి పడమటి ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జడ్పీ చైర్ పర్సన్  వనజ, నాయకులు బాలకృష్ణారెడ్డి, నాగరాజు గౌడ్, పోలీస్  చంద్రశేఖర్ రెడ్డి, గవినోళ్ల గోపాల్ రెడ్డి, రవికుమార్ యాదవ్, గడ్డంపల్లి హనుమంతు పాల్గొన్నారు.