
- ఎద్దును ఢీకొట్టిన ట్రైన్, దెబ్బతిన్న క్యాటిల్ గార్డ్
- మహబూబాబాద్ జిల్లా తాళ్లపూసలపల్లి స్టేషన్ సమీపంలో ఘటన
మహబూబాబాద్, వెలుగు : మహబూబాబాద్ జిల్లా తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం తప్పింది. మహబూబాబాద్ రైల్వే ఎస్సై సుభాని తెలిపిన వివరాల ప్రకారం... వందే భారత్ ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తోంది. ఈ క్రమంలో తాళ్లపూసలపల్లి స్టేషన సమీపంలో 428/11 కిలోమీటర్ వద్దకు రాగానే ఎద్దును ఢీకొట్టింది. దీంతో రైలు ఇంజిన్ ముందు భాగంలో ఉండే క్యాటిల్ గార్డ్ లో కొంత భాగం ఊడిపోయింది.
భారీ శబ్దం రావడంతో అప్రమత్తమైన డ్రైవర్ రైలును నిలిపివేసి ఆఫీసర్లకు సమాచారం ఇచ్చాడు. ఘటనాస్థలానికి చేరుకున్న సిబ్బంది రైల్‌కు తాత్కాలిక మరమ్మతులుచేసి, పట్టాల మీది నుంచి ఎద్దును తొలగించి రైల్‌ను యథావిధిగా పంపించారు. అనంతరం ట్రాక్ సమీపంలోని రైతులకు పోలీసులు కౌ న్సిలింగ్ ఇచ్చారు. రైలు పట్టాల సమీపంలో పశువులను వదిలితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.