పీవీ స్వగ్రామంలో సంబురాలు.. పటాకులు కాల్చి స్వీట్లు పంచుకున్న గ్రామస్తులు

పీవీ స్వగ్రామంలో సంబురాలు.. పటాకులు కాల్చి స్వీట్లు పంచుకున్న గ్రామస్తులు

హనుమకొండ/భీమదేవరపల్లి, వెలుగు: దేశ ప్రధానిగా ఎదిగిన తమ ఊరిబిడ్డ పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించడంతో హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. పటాకులు కాల్చి స్వీట్లు పంచి సంబురాలు చేసుకున్నారు. పీవీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వంగర ముద్దుబిడ్డ పీవీ.. అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పీవీ స్మారకార్థం ఢిల్లీలో పీవీ ఘాట్ నిర్మించాలని గ్రామస్తులు కోరారు. రాష్ట్రంలో పీవీ జిల్లాను, ఆయన పేరిట యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పీవీకి భారతరత్న ప్రకటించాలని 2013లో వంగర గ్రామస్తులు 48 గంటల పాటు రిలే నిరాహార దీక్ష చేపట్టారు.

పీవీ కుటుంబం ఎంతో గొప్పది

పీవీ కుటుంబంతో మాకు ఎంతో సాన్నిహిత్యం ఉండేది. మా నాన్న పీవీ నరసింహారావుతో క్లోజ్​గా ఉండేవారు. ఆయన నుంచి మేం ఎంతో నేర్చుకున్నాం. క్రమశిక్షణలో పీవీకి ఎవరూ సాటి లేరు. ఎన్నో సంస్కరణలు తెచ్చిన ఆయన సొంత భూములు కూడా వదులుకున్నారు. సమాజానికి సేవ చేయాలన్న భావన పీవీ కుటుంబం నుంచే నేర్చుకున్నాం.
‑ శ్రీరామోజు మొండయ్య, వంగర గ్రామస్తుడు

ప్రధానిగా పీవీ.. సర్పంచ్​గా నేను..

దేశ ప్రధానిగా పీవీ సేవలందిస్తున్న రోజుల్లో నేను వంగర సర్పంచ్​గా పని చేశాను. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రధానిగా ఉన్నా.. ఆయన గ్రామ అభివృద్ధి కోసం ఎప్పుడూ సలహాలు ఇచ్చేవారు. ఒకసారి పంచాయతీ పాలకవర్గంతో పాటు స్నేహితులను ఢిల్లీకి పిలిపించుకొని అంతా తిప్పి చూపెట్టారు. ‑ రఘునాయకుల వెంకటరెడ్డి, వంగర మాజీ సర్పంచ్​

పీవీకి భారత్నరత్న గర్వకారణం

పీవీకి భారత్నరత్న ఇవ్వాలని కొంతకాలం నుంచి పోరాటం చేస్తున్నాం. ఈ డిమాండ్​తో తెలంగాణ ఉద్యమానికి ముందు వంగర నుంచి హైదరాబాద్​కు సైకిల్ యాత్ర చేశాం. ఇన్నేండ్లకు ప్రభుత్వం గురించి పీవీకి భారతరత్న ప్రకటించడం సంతోషంగా ఉంది. భారతరత్న పీవీ నరసింహారావు మా ప్రాంతవాసి కావడం చాలా గర్వంగా ఉంది.
– పిడిశెట్టి రాజు, పీవీ సేవా సమితి అధ్యక్షుడు