16 లక్షల చేపపిల్లల పంపిణీ : వరదారెడ్డి

16 లక్షల చేపపిల్లల పంపిణీ :  వరదారెడ్డి

లింగంపేట, వెలుగు: ఈ ఏడాది వర్షాలు బాగా కురిసి చెరువులు అలుగులు పారుతున్నందున చేప పిల్లలను ఆలస్యంగా విడుదల చేస్తున్నట్లు జిల్లా మత్స్య సహకార శాఖ అధికారి వరదారెడ్డి పేర్కొన్నారు. బుధవారం లింగంపేట మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 13 సొసైటీల మత్స్య సహకార సంఘాల సభ్యులకు 16 లక్షల చేపపిల్లలు పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 697 చెరువుల్లో 2 కోట్ల78 లక్షల 60 వేల చేపపిల్లలను విడుదల చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు 85 లక్షల పిల్లలను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. రొయ్యల పెంపకం కోసం నిజాంసాగర్, కౌలాస్​నాలా ప్రాజెక్టులతో పాటు అడ్లూర్​ఎల్లారెడ్డి, కామారెడ్డి, మాచారెడ్డి, ఇబ్రహీంపేట, దోమకొండ గూండ్ల చెరువులను ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. 

వీటిలో 60,42,730 రొయ్య పిల్లలు విడుదల చేస్తామన్నారు. కార్యక్రమంలో లింగంపేట సర్పంచి లావణ్య, ఎంపీపీ గరీబున్నీసా, జడ్పీటీసీ శ్రీలత, ఎంపీడీవో మల్లికార్జున్​రెడ్డి, మార్కెట్​కమిటీ వైస్​చైర్మన్ సిద్ధారెడ్డి తదితరులు పాల్గొన్నారు.