ఫాలోవర్స్ పెరిగారంటూ లేడీ విలన్ డ్యాన్స్

ఫాలోవర్స్ పెరిగారంటూ లేడీ విలన్ డ్యాన్స్

వరుస హిట్‭లతో దూసుకుపోతున్న వరలక్ష్మీ శరత్ కుమార్ ట్విట్టర్‭లో రెండు మిలియన్ల ఫాలోవర్స్‭ను సొంతం చేసుకున్నారు. ఈ ఆనందంతో అమ్మడి కాలు భూమ్మీద నిలవడం లేదు. ఆ సంతోషాన్ని పంచుకుంటూ డ్యాన్స్ చేసిన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకోవడం వల్ల వారికి మరింత దగ్గరైనట్టుగా భావిస్తున్నానని ట్వీట్ చేశారు. 

కెరీర్ ప్రారంభంలో హీరోయిన్‭గా నటించిన వరలక్ష్మికి ఆ పాత్రలు కలిసిరాలేదు. తొలి చిత్రం పోడాపోడిలో నటుడు శింబుతో జతకట్టినా ఆశించిన విజయాన్ని సాధించలేదు. ఆ తరువాత బాలా దర్శకత్వంలో నటించిన తార్‌ తప్పటై చిత్రంలో విలక్షణ నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఆ తరువాత ఆటోమేటిక్‌గా విలన్ రోల్స్ చేయడం మొదలు పెట్టారు. అలా సర్కార్‌ చిత్రంలో విజయ్‌ను, సండైకోళి–2 చిత్రంలో విశాల్‌ను ఢీకొట్టి ప్రతినాయికగా పేరు తెచ్చుకున్నారు. అలా వరలక్ష్మి శరత్‌కుమార్‌ పేరు దక్షిణాది అంతటా పాకింది. ఇటీవల తెలుగులో వీరసింహారెడ్డి చిత్రంలో బాలకృష్ణకు ఎదురు నిలిచారు. అంతకుముందు హీరోయిన్ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కిన యశోద సినిమాలో వరలక్ష్మీ నటన ప్రేక్షకులకు మరింత ఆకట్టుకుంది. అలా వైవిధ్య భరిత పాత్రల్లో నటిస్తూ చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు.