కార్బన్ డేటింగ్కు నో.. హిందూ సంఘాల పిటిషన్ కొట్టివేత

కార్బన్ డేటింగ్కు నో.. హిందూ సంఘాల పిటిషన్ కొట్టివేత

జ్ఞాన వాపి మసీదు కేసులో శివలింగానికి కార్బన్ డేటింగ్ చేయాలని హిందూ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్ ను వారణాసిలోని ఒక జిల్లా కోర్టు కొట్టివేసింది. శివలింగానికి కార్బన్ డేటింగ్ చేయించడానికి నిరాకరించింది. కార్బన్ డేటింగ్ వంటి శాస్త్రీయ పరిశీలన ద్వారా శివలింగం నమూనాలు బయటపడతాయన్న హిందూ సంఘాల వాదనతో విభేదించింది. దీంతో వారణాసి కోర్టు దగ్గర పోలీసులను భారీగా మోహరించారు. ఇదే అంశంపై జ్ఞాన వాపి మసీదును నిర్వహించే అంజుమన్ ఇంతెజామియా కమిటీ తరఫున న్యాయవాది  ముంతాజ్ అహ్మద్ వాదనలు వినిపించారు. శివలింగానికి కార్బన్ డేటింగ్ చేసే క్రమంలో ఒకవేళ దానికి ఏదైనా స్వల్ప భౌతిక నష్టం వాటిల్లినా అది సుప్రీంకోర్టు ఆదేశాల ఉల్లంఘన కిందికే వస్తుందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 

అంజుమన్ ఇంతెజామియా కమిటీ తరఫున న్యాయవాది ముంతాజ్ అహ్మద్  ప్రస్తావించిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న జడ్జి ఎ.కె.విశ్వేష హిందూ సంఘాల పిటిషన్ ను తిరస్కరించారు. ‘‘శివలింగం ఎంతకాలం కిందటిది ? అది ఏ రకానికి చెందినది ? అనే అంశాలను గుర్తించాలంటూ ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను ఆదేశించడం సమంజసంగా ఉండదు’’ అని జడ్జి  వ్యాఖ్యానించారు. వాస్తవానికి శివలింగానికి కార్బన్ డేటింగ్ ను  డిమాండ్ చేస్తూ హిందూ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ మంగళవారం నాటికే పూర్తయింది. అయితే తీర్పును ఇవాళ విడుదల చేశారు. 

నేపథ్యం ఇదీ..

జ్ఞాన వాపి మసీదు వెనుక భాగంలో ఉన్న శృంగార గౌరీ దేవి దర్శనానికి, పూజకు అనుమతి ఇవ్వాలని అయిదుగురు మహిళలు కొన్ని నెలల క్రితం వారణాసి జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. దీనితో పాటు ప్లాట్ నంబర్ 9130 తనిఖీ చేసి, వీడియోగ్రఫీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. దీనిపై సెప్టెంబరు 12న వారణాసి జిల్లా  కోర్టు సానుకూలంగా స్పందించింది. జ్ఞాన్‌వాపి మసీదు సర్వే జరపాలని, వీడియోగ్రఫీ చేయాలని ఆదేశించింది. ప్రాథమిక సర్వేలో జ్ఞాన్‌వాపి మసీదు పరిసరాల్లో ఒకచోట 12 అడుగుల శివలింగం కనిపించిందని హిందువుల తరఫు న్యాయవాది చెప్పారు. ఆ ప్రాంతాల్లో మరికొన్ని కీలకమైన ఆధారాలు లభించాయని వివరించారు. మసీదులో బయపడ్డ ఆకారం శివలింగం కాదని జ్ఞాన వాపి మసీద్ కమిటీ స్పష్టం చేసింది. దీంతో ఈ వ్యవహారం సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. ఈ అంశాన్ని కింది స్థాయి కోర్టులో తేల్చుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం  స్పష్టం చేయడంతో తిరిగి వారణాసి కోర్టుకు కేసు చేరింది.