వారణాసి పోలీస్​ డ్రెస్ కోడ్..ధోతీ, కుర్తా, రుద్రాక్ష మాల

వారణాసి పోలీస్​ డ్రెస్ కోడ్..ధోతీ, కుర్తా, రుద్రాక్ష మాల

వారణాసిలోని కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో డ్యూటీ చేసే పోలీసులు ఇకపై కొత్త డ్రెస్ కోడ్​లో కన్పించనున్నారు. అర్చకుల మాదిరి ధోతీ, కుర్తా, నుదుటన నామాలు, మెడలో రుద్రాక్ష మాల ధరించనున్నారు.  మహిళా పోలీసులు సల్వార్ కుర్తాలో విధులకు హాజరవుతారు. భక్తుల్లో ఒకరిలా.. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు.

వారణాసి: ఉత్తరప్రదేశ్ వారణాసిలోని కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో డ్యూటీ చేసే పోలీసుల కోసం యోగి సర్కార్ కొత్త డ్రెస్ కోడ్ తీసుకొచ్చింది. ఖాకీ యూనిఫాంలో కాకుండా.. అర్చకుల మాదిరి ధోతీ, కుర్తా, నుదుటన నామాలు, మెడలో రుద్రాక్ష మాల ధరించాలని ఆదేశించింది. మహిళా పోలీసులు అయితే సల్వార్ కుర్తాలో విధులకు హాజరుకావాలని సూచించింది. సంప్రదాయ వస్త్రధారణలో డ్యూటీ చేయాలని ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. భక్తుల్లో ఒకరిలా.. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని పోలీస్ కమిషనర్ తెలిపారు. 

ఆలయానికి వచ్చిన భక్తులతో ఎలా వ్యవహరించాలి? వారితో ఎలా మాట్లాడాలి అన్నదానిపై మూడు రోజులపాటు ట్రైనింగ్ కూడా ఇచ్చామన్నారు. పోలీస్ యూనిఫాంలో విధులు నిర్వహిస్తే నెగిటివిటీతో పాటు రద్దీ టైమ్​లో వాళ్లు వ్యవహరించే తీరు భక్తులను బాధ కలిగించొచ్చు అని చెప్పారు. అర్చకుల మాదిరి ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని, భక్తులు కూడా ఫ్రెండ్లీగా ఉంటారని తెలిపారు. ఆలయాల్లో విధి నిర్వహణ మిగిలిన  ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉంటుందని చెప్పారు. భక్తుల రద్దీని కంట్రోల్ చేసేందుకు ‘నో టచ్’ పాలసీ అమలు చేస్తున్నామని తెలిపారు. 

వీఐపీలు ఆలయానికి వచ్చినప్పుడు భక్తులను అదుపు చేసేందుకు ఈ విధానం తీసుకొచ్చామన్నారు. భక్తులను తోయడం, గెంటేయడం వంటివి చేయబోమని, రోప్ ద్వారా కంట్రోల్ చేస్తామని, అక్కడి పరిస్థితుల నుంచి వేరే లైన్​లో ముందుకు పంపించేందుకు ప్రయత్నిస్తామని వివరించారు. 2018లో కూడా ఇలాంటి డ్రెస్ కోడ్ అమలు చేశామని గుర్తు చేశారు. అప్పుడు ఆలయం చిన్నగా ఉండేదని, రెనోవేషన్ తర్వాత భక్తుల తాకిడి భారీగా పెరిగిందని తెలిపారు. కాగా, యోగి సర్కార్ ప్రవేశపెట్టిన డ్రెస్​కోడ్​పై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు అర్చకుల మాదిరి డ్రెస్ కోడ్ ధరించాలని ఏ పోలీస్ మ్యానువల్​లో ఉందని సమాజ్​వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ప్రశ్నించారు. ఈ ఉత్తర్వులు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ డ్రెస్​ కోడ్​ను అవకాశంగా తీసుకుని కొందరు మోసాలకు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.