సిటీకి దగ్గరలో చదువులమ్మ గుడి..ఎలా వెళ్లాలంటే

సిటీకి దగ్గరలో చదువులమ్మ గుడి..ఎలా వెళ్లాలంటే

పిల్లల్ని బడిలో చేర్పించే ముందు వాళ్లకు అక్షరాభ్యాసం చేయించడం ఆనవాయితీ. చదువుల తల్లిగా పేరొందిన సరస్వతి గుడిలో పలకా బలపం పట్టించి అక్షరాలు దిద్దిస్తే, పిల్లలు బాగా చదువుతారని నమ్మకం. అందుకే  తెలుగు రాష్ట్రాల్లో చాలామంది తమ పిల్లల అక్షరాభ్యాసం కోసం బాసర సరస్వతి అమ్మవారి గుడికి వెళ్తారు. అంత దూరం వెళ్లలేని వాళ్లు  హైదరాబాద్​కి దగ్గర్లో ఉన్న వర్గల్​ సరస్వతి గుడికి వెళ్తారు. సిద్దిపేట జిల్లాలోని వర్గల్​లో ఉందీ గుడి. బండరాయి మీద, పంట పొలాల మధ్య ఉన్న ఈ ఆలయం చూసేందుకు చాలా బాగుంటుంది. 
ఈ గుడిని ‘వర్గల్​ సరస్వతి గుడి’, ‘శ్రీ విద్యా సరస్వతి గుడి’ అని పిలుస్తారు. 1998లో సరస్వతి భక్తుడు, వాస్తు నిపుణుడు యయవరం చంద్రశేఖర శర్మ ఈ దేవాలయాన్ని కట్టించాడు. 400 ఏండ్ల నాటి శంభు దేవుడి గుడి దగ్గర ఉన్న బండ రాయి మీద ఉంది ఈ గుడి. ఈ ఆలయం నిర్వహణ  శ్రీ కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇక్కడ గర్భగుడి 3 అంతస్తుల ఎత్తులో ఉంటుంది. గుడి ముందు పది అడుగుల ఎత్తున్న సరస్వతీ దేవి విగ్రహం ఆకట్టుకుంటుంది. సరస్వతి పుట్టిన రోజు (మూలానక్షత్రం కనిపించిన రోజు) అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఎక్కువగా వస్తారు. ఇక్కడ నిత్యం అన్నదానం చేస్తారు. ఇక్కడికి దగ్గర్లో ఉన్న శని దేవుడి గుడిలో శని దేవుడి విగ్రహం ఉంది. సరస్వతి గుడికి దగ్గర్లోనే వేద పాఠశాల ఉంది.  
అక్షరాభ్యాసం కోసం...
ఈ గుడిలో ఏడాది మొత్తం అక్షరాభ్యాసాలు జరు గుతాయి. వసంత పంచమి నాడు అయితే ఈ గుడికి చాలామంది వస్తారు. అక్షరాభ్యాసం ఫీజు 250 రూపాయలు. సోమవారం నుంచి గురువారం వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 నుంచి 7 వరకు అక్షరాభ్యాసం చేయిస్తారు. శుక్ర, శని, ఆదివారాల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు, సాయంత్రం 4 నుంచి 7 వరకు అక్షరాభ్యాసం చేయిస్తారు. 
తీసుకెళ్లాల్సినవి
బియ్యం–  అర కిలో లేదా కిలో. ఎండు కొబ్బరికాయలు– రెండు,  వక్కలు – 3, ఎండు ఖర్జూర, తమలపాకులు –‌‌‌‌ 5 లేదా 6, 
పిల్లల మెడలో వేసేందుకు చిన్న పూల దండ, ఒక పెద్ద పలక, కొన్ని పూలు, పండ్లు . వీటన్నిటినీ ఇంటి నుంచి తీసుకెళ్లాలి. ఈ పూజా సామగ్రి  
గుడి దగ్గరి దుకాణాల్లో కూడా దొరుకుతుంది. 
ఇలా వెళ్లాలి
హైదరాబాద్​ నుంచి 48 కిలోమీటర్ల దూరంలో  ఉంది శ్రీ విద్యా​ సరస్వతి గుడి. సిద్దిపేట నుంచి 56 కిలోమీటర్ల జర్నీ. వర్గల్​ ఊరికి ముందు సరస్వతి గుడి కమాన్​ ఉంటుంది. అక్కడి నుంచి ఆటోలు ఉంటాయి.  
టైమింగ్స్: ఉదయం 8 నుంచి సాయంత్రం 7 వరకు.