ఏడాదిన్నరలోగా ఇండ్లు కట్టివ్వాల్సిందే

ఏడాదిన్నరలోగా ఇండ్లు కట్టివ్వాల్సిందే

యాదాద్రి, వెలుగు: ‘‘ఊరును బంగారు వాసాలమర్రి చేస్తమంటున్నరు.. ఉన్న ఇండ్లన్నీకూల్చేసుకుంటే కొత్త ఇండ్లు కట్టిస్తమంటున్నరు.. ఇంతవరకు మంచిగనే ఉంది.. కానీ, ఇండ్లు కట్టకముందే మధ్యలో ఎన్నికలొచ్చి.. రాజకీయాలు ఎటమటమైతే మా పరిస్థితి ఏంది?’’ అని సీఎం కేసీఆర్​ దత్తత గ్రామమైన వాసాలమర్రి గ్రామస్తులు టీఆర్​ఎస్​ ప్రజాప్రతినిధులను ప్రశ్నించారు. టీఆర్ఎస్​ గెల్వకుంటే ఎట్లా అనే అర్థంలో గ్రామస్తులు మాట్లాడే సరికి లీడర్లు షాక్​ అయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలోని ఇండ్లన్నింటినీ తొలగించి కొత్త ఇండ్లు కట్టిస్తానని కేసీఆర్​ ఇచ్చిన హామీ ప్రకారం కలెక్టర్​ఆధ్వర్యంలో బ్లూప్రింట్​ రెడీ చేస్తున్నారు. దీనికి పంచాయతీ తీర్మానం అవసరం కావడంతో సర్పంచ్​ పోగుల ఆంజనేయులు, ఎంపీటీసీ మెంబర్​ నవీన్​ ఆధ్వర్యంలో ఆదివారం గ్రామ సభ నిర్వహించారు. ముందుగా సర్పంచ్​ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతి ఒక్క కుటుంబానికి 200 గజాల్లో ఒకేరకంగా ఇండ్లు కట్టించి ఇస్తుందని, అన్ని సౌకర్యాలను కల్పిస్తామని చెప్పారు. ఎన్ని కోట్లు ఖర్చయినా సీఎం కేసీఆర్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మంగళవారం నిర్వహించే గ్రామసభకు కలెక్టర్​ పమేలా సత్పతి వస్తున్నారని, ఆమె సమక్షంలో బంగారు వాసాలమర్రికి తీర్మానం చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. 

ఈ సందర్భంగా గ్రామస్తులు పలు అనుమానాలు లేవనెత్తారు. ‘‘ఎన్నికలకు ఏడాదిన్నర టైముంది. బ్లూప్రింట్​ తయారై.. ఊరును కూలగొట్టి కొత్తది కట్టేలోపు ఎన్నికలు వచ్చే అవకాశముంది. ఎన్నికల్లో రాజకీయాలు ఎటమటమైతే మా గ్రామం పరిస్థితి ఏంది” అని ప్రశ్నించారు. దీంతో సర్పంచ్​ ఆంజనేయులు జోక్యం చేసుకొని.. అలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని, సీఎం కేసీఆర్​ న్యాయం చేస్తారని చెప్పారు. 

భూమికి భూమి ఇస్తేనే

సీసీ రోడ్ల నిర్మాణానికి 50 గజాల వరకు ప్రభుత్వం తీసుకుంటే ఒప్పుకుంటామని, అంతకంటే ఎక్కువైతే.. కోల్పోయిన భూమి ఎంతో.. అంత భూమి వేరే చోట ఇస్తేనే ఇండ్ల నిర్మాణానికి అంగీకరిస్తామని వాసాలమర్రి గ్రామస్తులు స్పష్టం చేశారు. ‘‘గ్రామంలో ప్రతి కుటుంబానికి 200 గజాల్లో ఒకే రకంగా ఇల్లు అంటున్నరు. కొందరికి 100 గజాలు ఉంటే.. మరికొందరికి 500 గజాలకు పైగా స్థలముంది. 200 గజాల్లోనే ఇల్లు అన్నప్పుడు 500 గజాల స్థలం ఉన్నోళ్లు కోల్పోతున్న 300 గజాల జాగా వేరే చోట ఇస్తేనే ఇండ్ల నిర్మాణానికి ఒప్పుకుంటం’’ అని తేల్చిచెప్పారు. తాము నాలుగైదేండ్ల కిందనే  లక్షల రూపాయలు  ఖర్చు పెట్టి ఇండ్లు కట్టుకున్నామని, ఇప్పుడు కొత్తగా అంటే తమ పరిస్థితి ఏందని పలువురు ప్రశ్నించారు. తమకు ప్రత్యేకంగా పరిహారం ఇప్పించాలని డిమాండ్​ చేశారు. గ్రామంలోని అన్ని కుటుంబాలకు అన్ని వసతులతో కూడిన టెంపరరీ ఇండ్లను చూపించిన తర్వాతే ఇప్పుడున్న ఇండ్లను తొలగించాలని గ్రామస్తులు అన్నారు. ఉమ్మడి కుంటుంబాలకు  జీ ప్లస్​ వన్​పద్ధతిలో ఇండ్లు కట్టించి ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా కొందరు గ్రామస్తులు లేచి.. ఎర్రవల్లి, చింతమడక మాదిరిగా తమ దగ్గర ఇండ్ల నిర్మాణం లేటు జరిగితే ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ఏడాదిన్నర లోపు నిర్మాణం పూర్తి చేయించే విధంగా తీర్మానం చేయించాలని గ్రామస్తులు కోరారు. గ్రామస్తులు లేవనెత్తిన అనుమానాలు, డిమాండ్లను రికార్డు చేసుకున్నామని, వీటిని సీఎం కేసీఆర్​ దృష్టికి తీసుకెళ్తామని సర్పంచ్​ చెప్పారు.