అమ్మవారి ముందు అ ఆ.. దిద్దించిన్రు

అమ్మవారి ముందు అ ఆ.. దిద్దించిన్రు

బాసరలో వేడుకగా వసంత పంచమి

బాసర, వెలుగు: నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి క్షేత్రంలో మూడు రోజులుగా కొనసాగుతున్న వసంత పంచమి(శ్రీపంచమి) ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. ప్రభుత్వం తరఫున మంత్రి అల్లోల ఇంద్రకరణ్​రెడ్డి, ముథోల్​ ఎమ్మెల్యే విఠల్​రెడ్డి పట్టు వస్త్రాలను అమ్మవారికి సమర్పించారు. వసంత పంచమి రోజున చిన్నారులతో అక్షరాభ్యాసం చేయిస్తే విద్యావంతులవుతారని భక్తుల నమ్మకం. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు నుంచి దాదాపు లక్షకు పైగా భక్తులు బాసరకు వచ్చారు. క్షేత్రంలో ఉన్న అతిథి గృహాలన్నీ నిండిపోయాయి. చాలామంది భక్తులు ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో పడుకున్నారు. వేకువజామున 2 గంటల నుంచే భక్తులు అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. పలు స్వచ్ఛంద సేవా సంస్థలు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు పాలు, బిస్కెట్లు, తాగునీరు, అరటి పండ్లు అందజేశారు. జై మాతాదీ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు అమ్మవారి దర్శనానికి వచ్చిన దాదాపు పది వేల మందికి అన్నదానం చేశారు. మొత్తం 3731 మంది చిన్నారులకు అక్షర శ్రీకార పూజలు చేయించారు.  ప్రసాదాలు, ఆర్జిత సేవల ద్వారా ఆలయానికి రూ. 35,72,150 ఆదాయం సమకూరింది.