
న్యూఢిల్లీ: తమిళనాడులోని తన కాపర్ స్మెల్టర్ కాంప్లెక్స్‌ను అమ్మకానికి పెట్టాలని వేదాంత నిర్ణయించింది. ఇక్కడ జరిగిన పోలీసు కాల్పుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయిన నాలుగేళ్ల తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. యాక్సిస్ క్యాపిటల్‌తో కలిసి తూత్తుకుడిలోని స్మెల్టర్ కోసం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్స్లను ఆహ్వానించింది. ఆసక్తిగల కొనుగోలుదారులు తమ బిడ్లను సమర్పించడానికి జులై 4 సాయంత్రం 6 గంటల వరకు సమయం ఉంది. కాపర్ రిఫైనరీ, కాపర్ రాడ్ ప్లాంట్, సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్లాంట్, ఆక్సిజన్ ఉత్పత్తి యూనిట్, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ వంటి ఆస్తులు అమ్మకానికి ఉన్నాయి. దేశ కాపర్ ప్రొడక్షన్లో ఈ ప్లాంటు వాటా 40 శాతంగా ఉండేది. మూసివేసే నాటికి ప్రత్యక్షంగా 5,000 మందికి ఉపాధి కలిపించిందని వేదాంత చెబుతోంది. ఈ ఫ్యాక్టరీకి ఏటా నాలుగలక్షల టన్నుల రాగి తయారు చేసే కెపాసిటీ ఉంది. ఈ స్మెల్టర్‌ను 2018 మే లో మూసేశారు. కాలుష్యం కారణంగా ప్లాంట్‌ను మూసివేయాలని పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. నిరసనకారులను పోలీసులు తీవ్రంగా హింసించారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల వర్కింగ్ గ్రూప్ విమర్శించింది. ప్లాంట్ కాలుష్యాన్ని కలిగిస్తోందన్న ఆరోపణలను కొట్టిపారేసిన వేదాంత, దీనిని మూసివేయాలన్న తమిళనాడు ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసింది. కేసు విచారణలో ఉంది.