న్యూఢిల్లీ: మైనింగ్ కంపెనీ వేదాంత లిమిటెడ్‌లో 2.63 శాతం వాటాను అమ్ముతామని పేరెంట్ కంపెనీ వేదాంత రిసోర్సెస్ ప్రకటించింది. అప్పులు తగ్గించుకోవడానికి, బిజినెస్‌ను విస్తరించడానికి ఈ ఫండ్స్ వాడతామని పేర్కొంది. ఈ వాటాల అమ్మకాన్ని సబ్సిడరీ కంపెనీ ఫిన్‌సైడర్ ఇంటర్నేషనల్ ద్వారా వేదాంత రిసోర్స్ చేపట్టనుంది. వేదాంత లిమిటెడ్‌లో ఫిన్‌సైడర్‌కు 2.63 శాతం వాటా ఉంది.
‘కొంత మంది ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు వేదాంత లిమిటెడ్‌లోని 2.6 శాతం వాటాను అమ్మడానికి బ్యాంకులు చేసిన ప్రపోజల్‌ను వేదాంత రిసోర్సెస్ సబ్సిడరీ ఫిన్‌సైడర్ ఇంటర్నేషనల్ అంగీకరించింది’ అని వేదాంత రిసోర్సెస్ స్పోక్స్‌పర్సన్ పేర్కొన్నారు. కాగా, అప్పులు తగ్గించుకునేందుకు వేదాంత లిమిటెడ్‌లో వాటాలను ప్రమోటర్లు తగ్గించుకుంటున్నారు.
2022 డిసెంబర్ నాటికి వేదాంత లిమిటెడ్‌లో వేదాంత రిసోర్సెస్ వాటా 69.68 శాతం ఉండగా, ఈ ఏడాది మార్చి నాటికి ఈ నంబర్ 61.95 శాతానికి తగ్గింది. వేదాంత లిమిటెడ్ షేర్లు బుధవారం 2.65 శాతం పడి రూ.442 దగ్గర సెటిలయ్యాయి.
