
న్యూఢిల్లీ: బిలియనీర్ అనిల్ అగర్వాల్ నాయకత్వంలోని వేదాంత కంపెనీ స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్‌కు ఈనెల పదో తేదీన 100 మిలియన్ డాలర్ల (రూ.870 కోట్ల) అప్పును చెల్లించినట్లు తెలిపింది. తమకు అప్పులు ఎక్కువగా లేవని, రీపేమెంట్లను సకాలంలో చెల్లిస్తున్నామని స్పష్టం చేసింది. 2023 మార్చి వరకు తిరిగి చెల్లించాల్సిన మొత్తం అప్పును ముందే చెల్లించామని, గడిచిన 11 నెలల్లో 2 బిలియన్ డాలర్లు కట్టామని తెలిపింది. ఈ ఏడాది జూన్ తో ముగిసే క్వార్టర్‌కు లిక్విడిటీ అవసరాలను తీర్చుతామని వేదాంత రిసోర్సెస్ స్పష్టం చేసింది.
‘‘మాకు35 బిలియన్ డాలర్లకు పైగా మూలధనాన్ని సమీకరించిన రికార్డు ఉంది. మేం ఎప్పుడూ అప్పులను గడువులోపే కడుతున్నాం. తగినంత క్యాష్ ఫ్లోలను అందించగల అసెట్ బేస్ ఉంది. సమీప కాలంలో మా ఆదాయం 30 బిలియన్ డాలర్లుగా ఉంటుందని భావిస్తున్నాం" అని పేర్కొంది. 2022 ఆర్థిక సంవత్సరంలో వేదాంత లిమిటెడ్‌కు6.1 బిలియన్ డాలర్ల ఇబిటా, 3.6 బిలియన్ డాలర్ల ఫ్రీ క్యాష్ ఫ్లో వచ్చింది.