- రోజు మార్కెట్‌కు 50 క్వింటాళ్లకు పైగా తరలింపు
మెదక్, శివ్వంపేట, వెలుగు: మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని నవాబుపేటలో 450 కుటుంబాలు ఉండగా అందులో దాదాపు 300 మంది రైతులు కూరగాయలు పండిస్తారు. తమకున్న భూ విస్తీర్ణాన్ని బట్టి ఒకటి, రెండు గుంటలు మొదలు కొని ఎకరా, రెండెకరాల విస్తీర్ణంలో వివిధ రకాల కూరగాయ పంటలను సాగు చేస్తారు. కొందరు రైతులు వరి సాగు చేసి కొంత విస్తీర్ణంలో కూరగాయలు పండిస్తే మరి కొందరు రైతులు పూర్తిగా కూరగాయ పంటలే సాగు చేస్తారు. గ్రామ పరిధిలో దాదాపు 150 ఎకరాల విస్తీర్ణంలో కూరగాయ పంటలు సాగవుతాయి.
నవాబుపేట రైతులు టమాటా, వంకాయ, బెండ, కాకర, బీర, క్యాబేజీ, కాలీ ఫ్లవర్, పచ్చి మిర్చి, దొండకాయ, పెద్ద చిక్కుడు, బీర్నిస్, క్యాప్సికం, చామగడ్డ, గోరు చిక్కుడు కాయ ఎక్కువగా పండిస్తారు. వీటితోపాటు పాలకూర, తోటకూర, మెంతికూర, కోతిమీర, పుదీనా, పొనగంటి కూర సాగు చేస్తున్నారు. కూరగాయలు సాగుచేసే రైతులు నాణ్యమైన విత్తనాలను, నారును సిద్దిపేట జిల్లాలోని ఒంటి మామిడి మార్కెట్ యార్డులో, హైదరాబాద్ కొంపల్లిలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలో, సంగారెడ్డి జిల్లాలోని గుమ్మడిదలలోని దుకాణాల్లో కొనుగోలు చేస్తారు.
ప్రతి రోజు మార్కెట్‌కు..
దాదాపు 150 ఎకరాల విస్తీర్ణంలో కూరగాయలు సాగు చేస్తుండడంతో దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ప్రతీ రోజూ ఊరి నుంచి సుమారు 50 క్వింటాళ్ల కూరగాయలు హైదరాబాద్ నగర శివారులోని షాపూర్, బోయిన్ పల్లి కూరగాయల మార్కెట్ కు తరలిస్తారు. రోజు ఆయా మార్కెట్ల నుంచి హోల్ సేల్ వ్యాపారులు డీసీఎం వ్యాన్లలో నవాబుపేటకు వచ్చి కూరగాయలు మార్కెట్లకు తీసుకువెళ్తారు. కొందరు రైతులు టాటాఏస్, ఆటోల్లో కూరగాయలను మార్కెట్ కు తీసుకెళ్లి విక్రయిస్తారు.
తక్కువ విస్తీర్ణంలో కూరగాయలు సాగు చేసే రైతులు తాము పండించిన కూరగాయలు, ఆకు కూరలను సమీపంలోని నర్సాపూర్, తూప్రాన్, గుమ్మడిదలలో జరిగే వారాంతపు సంతల్లో అమ్ముతారు. ప్రభుత్వం మైక్రో ఇరిగేషన్ పథకం కింద సబ్సిడీ ఇస్తుండడంతో నవాబుపేట రైతులు డ్రిప్ సిస్టం ఏర్పాటు చేసుకుంటున్నారు. కొంత మంది పందిరి విధానంలో తీగజాతి కూరగాయాలు సాగు చేస్తున్నారు. మరికొందరు మల్చింగ్ విధానం అవలంభిస్తున్నారు. ఏదో రకంగా గ్రామంలో ఏడాది పొడగునా కూరగాయలు సాగవుతాయి.
మార్కెట్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది
మా గ్రామంలో మెజారిటీ ప్రజల జీవనాధారం వ్యవసాయమే. ఎక్కువ శాతం రైతు కుటుంబాలే. అందువల్ల దాదాపు ప్రతీ కుటుంబం కూరగాయ పంటలు సాగు చేస్తుంది. మా కుటుంబం కూడా కూరగాయలు సాగు చేస్తుంది. ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీల కోసం ఎదురు చూడకుండా రైతులే ఒకరికి ఒకరం సలహాలు, సూచనలు ఇచ్చుకుంటూ మార్కెట్లో ఉండే డిమాండ్‌ను బట్టి కూరగాయలు పండిస్తాం. పెద్ద మొత్తంలో కూరగాయల దిగుబడి ఉంటున్నందున నవాబుపేటలో కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేస్తే రైతులకు మేలవుతుంది. - అశోక్ రెడ్డి, సర్పంచ్, నవాబుపేట
అన్ని రకాల కూరగాయలు పండిస్తాం
మా ఊరు కూరగాయలకు ఫేమస్. దాదాపు ఊర్లో ఉన్న రైతులందరం కూరగాయలు సాగు చేస్తం. వివిధ రకాల కూరగాయలు, ఆకు కూరలు పండిస్తం. ఏడాదంతా కూరగాయలు సాగు చేస్తం. వరికంటే కూరగాయల సాగులోనే లాభం ఎక్కువ ఉంటుంది. సీజన్‌ను బట్టి కూరగాయలను ఎంచుకుని వాటినే ఎక్కువగా సాగుచేస్తాం. మేము పండించే కూరగాయలు షాపూర్, బోయిన్ పల్లి మార్కెట్ కు తీసుకెళ్తాం. మార్కెట్ మా గ్రామంలో ఉంటే ట్రాన్స్పోర్ట్ చార్జెస్తప్పుతుండె. - జంగారెడ్డి, రైతు, నవాబుపేట
