ధరలు దిగొస్తున్నయ్ !.. సామాన్యులకు అందుబాటులోకి కూరగాయల రేట్లు

ధరలు దిగొస్తున్నయ్ !.. సామాన్యులకు అందుబాటులోకి కూరగాయల రేట్లు

రైతుబజార్లలో టమాట, పచ్చి మిర్చి కిలో రూ. 40 –50  
డిమాండ్​కి సరిపడా దిగుమతి  

వారం తర్వాత మరింత తగ్గే అవకాశం  

హైదరాబాద్, వెలుగు: మొన్నటిదాకా ఆకాశన్నంటిన కూరగాయల ధరలు దిగొస్తున్నాయి. వారం కిందట కిలో రూ.200 ఉన్న పచ్చి మిర్చి, టమాటా ప్రస్తుతం రైతుబజార్లలో కిలో రూ.50 ఉండగా.. బహిరంగ మార్కెట్లో ఇంతకు పది, ఇరవై రూపాయలు ఎక్కువగా అమ్ముతున్నారు. బెండకాయ, బీన్స్, చిక్కుడు, బీరకాయ ఇలా అన్ని కూరగాయల రేట్లు తగ్గుతున్నాయి. మొత్తంగా కూరగాయల ధరలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి. ఆకుకూరల రేట్లు కూడా తగ్గాయి. 

పాలకూర, తోటకూర, గోంగూర, పొన్నగంటికూర, బచ్చలకూర, మెంతికూర, కొత్తిమీర,బచ్చలి కూర, సోయకూర, గంగవాయిలి, కొత్తిమీర, పూదీన ధరలు తగ్గాయి.  రూ.10 ఒకటి, రెండు కట్టల ఇవ్వగా ఇప్పుడు నాలుగైదు కట్టలు ఇస్తున్నారు. డిమాండ్ కి సరిపడా కూరగాయలు మార్కెట్లకు వస్తున్నాయి. వారం తర్వాత ఇంకా తగ్గొచ్చని అధికారులు చెబుతున్నారు. నెలరోజులుగా టమాటా రేటు చూసి జనం బెంబేలెత్తారు. ఇప్పుడు కిలో రూ.40, వందకి రెండు కిలోలకు అమ్ముతుండగా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కిలో, రెండు కిలోలు కూడా తీసుకెళ్తున్నారు. 

తగ్గడానికి కారణాలివే.. 

ఈ ఏడాది వాతావరణ మార్పులతో సమ్మర్ లో కూడా వానలు పడటంతో చేతికొచ్చిన కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. వర్షాకాలం ప్రారంభంలో వానలు పడకపోగా రైతులు సాగు చేయలేదు. ఆలస్యంగా వేయడంతో కూరగాయలు గత నెలలో చేతికిరాలేదు. దీంతో పాటు గత నెలలో ఉత్తరాదిలో వర్షాలు కురిశాయి. రేట్లు పెరగడానికి ఇది కూడా ఓ కారణమైంది. హైదరాబాద్​కు ఎక్కువగా ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, యూపీ, మధ్యప్రదేశ్ నుంచి దిగుమతి అవుతుంటాయి. ఉత్తరాదిలో వానల కారణంగా అక్కడ కూరగాయలకు డిమాండ్ ఉండడంతో పాటు రేట్లు ఎక్కువగా పలుకుతుండగా.. దిగుమతి చేసేవారిలో కొందరిని అక్కడికి పంపారు. 

ఇలా హైదరాబాద్ శివారు ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు ఒక్కసారిగా తగ్గడంతో రేట్లు పెరిగాయి. వారం రోజులుగా రంగారెడ్డి, మేడ్చల్‌, చేవెళ్ల, వికారాబాద్‌, శంకర్‌పల్లి, సిద్దిపేట, గజ్వేల్‌ తదితర ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాలనుంచి కూడా ఎప్పటిలాగే కూరగాయలు దిగుమతులు అవుతున్నాయి.  దీంతో డిమాండ్ కి సరిపడా మార్కెట్ కు వస్తుండటంతో రేట్లు తగ్గుతున్నాయి. 

 దిగుమతి అవుతుండగా..

సిటీలో ఆర్కేపురం, ఫలక్​నుమా, అల్వాల్​, ఎల్లమ్మబండ, మెహిదీపట్నం, వనస్థలిపురం​, కూకట్​పల్లి, సరూర్​నగర్​, ఎర్రగడ్డలో  రైతుబజార్లు ఉండగా డైలీ దాదాపు 600 నుంచి 800 టన్నుల కూరగాయల విక్రయాలు జరుగుతాయి. మొన్నటి వరకు కేవలం 500 టన్నుల వరకు వెజిటేబుల్స్​ మాత్రమే వచ్చేవి.  వారం రోజులుగా 600 టన్నులకి పైగానే దిగుమతి అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.  సిటీలోని హోల్ సేల్ మార్కెట్లు, రైతుబజార్లు, బయటి మార్కెట్లలో అన్ని రకాల ఆకుకూరలకు దాదాపు 150 టన్నుల వరకు డిమాండ్ ఉంది. గతనెల వరకు కేవలం 80 టన్నులు మాత్రమే వచ్చేది. వారం రోజులుగా డిమాండ్​కు సరిపడా వస్తుండగా రేట్లు  కూడా దిగొస్తున్నాయి.

మరింత తగ్గుతాయి 

ప్రస్తుతం డిమాండ్​కు  సరిపడా కూరగాయలు వస్తున్నాయి. మరో వారమైతే ఇంకా ఎక్కువగా వస్తాయి. రేట్లు కూడా తగ్గుతాయి. రైతుబజార్​లో అన్నిరకాల కూరగాయలు అందుబాటులో ఉండేలా.. వినియోగదారులకు ఇబ్బందులు రాకుండా చూస్తున్నం. రైతులు  నేరుగా అమ్ముతున్నారు. శివారు ప్రాంతాల నుంచి బాగా దిగుమతులు బాగా అవుతున్నాయి. 

విజయ్, ఎస్టేట్ ఆఫీసర్, మెహిదీపట్నం రైతుబజార్