మిడ్​డే మీల్స్​కు ‘వెజ్’ ట్రబుల్

V6 Velugu Posted on Nov 26, 2021

  • కొండెక్కిన కూరగాయల ధరలు
  • భారీగా పెరిగిన కోడి గుడ్ల ధర
  • స్టూడెంట్స్‌‌కు వండిపెట్టలేమంటున్న హెల్పర్లు
  • పట్టించుకోని రాష్ట్ర సర్కారు

జయశంకర్‌‌ భూపాలపల్లి/మహాముత్తారం, వెలుగు: కూరగాయల రేట్లు భారీగా పెరగడంతో ప్రభుత్వ స్కూళ్లలో మిడ్​డే మీల్స్​కు బ్రేకులు పడుతున్నాయి. గవర్నమెంట్​ స్కూళ్లలో మధ్యాహ్న భోజనం తయారు చేయడానికి హెల్పర్లు భయపడుతున్నారు. కూరగాయలు.. కోడిగుడ్ల రేట్లు అమాంతం పెరగడంతో వంట చేయలేమంటూ హెల్పర్లు మొత్తుకుంటున్నారు. ప్రతిరోజు కచ్చితంగా మెనూ పాటించాలని హెచ్​ఎంలు చెబుతున్నారు. కూరగాయలు, ఇతర నిత్యావసర సరుకుల​ రేట్లు పెరగడంతో మెనూ ప్రకారం ఎలా వండి పెట్టాలని హెల్పర్లు  ప్రశ్నిస్తున్నారు. దీనికి తోడు హెల్పర్లకు మూడు నెలలుగా మిడ్​డే మీల్స్​ బిల్లులు, గౌరవ వేతనాలు అందకపోవడంతో అప్పులు చేసి వండి పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది.  రాష్ట్రంలో ఇప్పటికే 800 స్కూళ్లలో మిడ్‌‌ డే మీల్స్‌‌ బంద్‌‌ అయినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇదిలాగే కొనసాగితే మరికొద్ది రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మిడ్‌‌ డే మీల్స్‌‌ స్కీం క్లోజ్‌‌ అవుతుందని టీచర్స్​ యూనియన్లు మొత్తుకుంటున్నాయి.

వారానికి మూడుసార్లు కోడిగుడ్డు..
రాష్ట్రంలో 26,040 గవర్నమెంట్, లోకల్‌‌బాడీ స్కూళ్లు ఉన్నాయి. వీటిలో సుమారు 21.50​ లక్షల మంది స్టూడెంట్స్‌‌ చదువుకుంటున్నారు. స్టూడెంట్లకు మధ్యాహ్న భోజనంలో వారంలో మూడుసార్లు ఉడికించిన కోడిగుడ్డు పెట్టాలి. ప్రభుత్వ మెనూ ప్రకారం సోమవారం కోడిగుడ్డు, కూరగాయలు, మంగళవారం పప్పు, ఆకుకూరలు, బుధవారం కోడిగుడ్డు, కూరగాయలు, గురువారం సాంబారు, శుక్రవారం కోడిగుడ్డు, పప్పు,  కూరగాయలు, శనివారం వెజ్​బిర్యాని ఇవ్వాల్సి ఉంది. 

ఏం కొనాలి.. ఏం పెట్టాలి
రాష్ట్రంలో కూరగాయల ధరలు కొండెక్కాయి. టమాట కిలో రూ. 100కి దిగనంటోంది.  పచ్చిమిర్చి రూ. 60కి చేరింది. ఏ కూరగాయ తీసుకున్న కిలో రూ. 60 పైనే ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు కిలో రూ. 20 ఉన్న తోటకూర ఇప్పుడు రూ. 30 కి చేరింది. కిలో రూ. 30 ఉన్న చుక్కకూర 40కి,  పాలకూర రూ. 50కి చేరింది.  ఇలా  ఆకు కూరల ధరలు కూడా చుక్కలు చూపిస్తున్నాయి. మొన్నటివరకు రూ. 5 ఉన్న కోడిగుడ్డు ధర ఇప్పుడు 6కి పెరిగింది. సర్కారేమో ప్రైమరీ స్కూళ్లలో ఒక్కో స్టూడెంట్​కు రూ. 4.97, హైస్కూళ్లలో రూ. 7.45 చెల్లిస్తోంది. ఒక్కో కోడి గుడ్డుకు రూ. 4 చొప్పున ఇస్తున్నారు. అన్నింటి ధరలు పెరగడంతో స్కూళ్లలో వారానికి ఒకసారి మాత్రమే గుడ్డు పెడుతున్నారు. స్టూడెంట్ల తల్లితండ్రులు ప్రశ్నిస్తే రేట్లు పెరిగాయని సమాధానం ఇస్తున్నారు.  ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యాహ్న భోజనం వండాలంటే ఒక్కో స్టూడెంట్​పై రూ. 10 వరకు వంట నిర్వాహకులు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. నెలకు కనీసం రూ.2 వేల నుంచి రూ.5 వేలకు పైగా భారం వీరిపై పడుతోంది. ఇంత భారం భరించలేక రాష్ట్రంలో ఒక్కో స్కూల్‌‌లో మిడ్‌‌ డే మీల్స్‌‌ను హెల్పర్లు బంద్‌‌ చేస్తున్నట్లుగా టీచర్​యూనియన్లు చెబుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా హెల్పర్లకు బకాయిలు చెల్లించడంతో పాటు స్టూడెంట్స్‌‌కు ఇచ్చే రేట్‌‌ను కూడా పెంచాలని కోరుతున్నారు. 

మెనూ ప్రకారం వండాలంటున్నరు
మూడు నెలలుగా బిల్లులు, గౌరవ వేతనాలు అందడం లేదు. స్కూల్​ హెచ్ఎంలు మెనూ ప్రకారం వండకపోతే ఒప్పుకోవడం లేదు. అయినా పిల్లలకు అప్పులు చేసి వండి పెడుతున్నం. మమ్మల్ని పట్టించుకునేవారే కరువయ్యారు.  రోజూ కూలి పని చేసుకుని పొట్టగడుపుకొనే మేం అప్పులకు వడ్డీ కట్టలేకపోతున్నం. మా కుటుంబాలను పోషించడం కష్టమవుతోంది. 
– గుండు గున్నమ్మ, మహా ముత్తారం జడ్పీహై స్కూల్‌‌ హెల్పర్‌‌

కూరగాయలు కన్నీళ్లు తెప్పిస్తున్నయ్
నెల రోజుల నుంచి కూరగాయలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఏ కూరగాయ కొందామనుకున్న కిలోకు రూ. 80 నుంచి  100 పైమాటే. వంద రూపాయలు పట్టుకుని వార సంతకు పోతే రెండు రకాల కూరలు కూడా వత్తలేవు. ఒక్కసారిగా పెరిగిన రేట్లతో ఏం కొనలేకపోతున్నం. కాయగూరల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.   
‒ ఎర్నేని కిష్టమ్మ, ములుగుపల్లి ప్రైమరీ స్కూల్‌‌ హెల్పర్‌‌, భూపాలపల్లి

Tagged Telangana, students, vegetables, Mid day meals, hostles

Latest Videos

Subscribe Now

More News