- మంత్రి వాకిటి శ్రీహరి
మహబూబ్ నగర్, వెలుగు: వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తేనే రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. శుక్రవారం నారాయణపేటలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా అరైవ్, -అలైవ్ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి రోజు 3 వేల కొత్త వాహనాలు రోడ్డు పైకి వస్తున్నాయని, ప్రమాదాలు కూడా పెరుగుతూనే ఉన్నాయన్నారు.
చాలా ప్రమాదాలు నిర్లక్ష్యం, అజాగ్రత్తతోనే జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నటుడు బాబు మోహన్, కోట శ్రీనివాసరావు, మంత్రులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, అజాహరుద్దీన్ కొడుకులు రోడ్డు ప్రమాదాల్లోనే చనిపోయారని గుర్తు చేశారు.
వాహనాల స్పీడ్మీటర్లపై అమ్మ-నాన్న పేర్లు ఉండేలా స్టికర్లను అంటించాలని అధికారులకు సూచించారు. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే గాయపడిన వారిని సమీప ఆసుపత్రుల్లో చేర్పించాలని, వారికి ప్రశంసాపత్రంతో పాటు రూ.5 వేలు నగదు బహుమతి ఇస్తామని తెలిపారు. శివ కుమార్ రెడ్డి, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ వినీత్, లైబ్రరీ చైర్మన్ విజయ్, డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.
శిలాఫలకంపై సీఎం పేరేది?
వనపర్తి/మదనాపురం: ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని పరమేశ్వరస్వామి చెరువు సుందరీకరణ పనుల శంకుస్థాపన శిలాఫలకంపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్లు లేకపోవడంపై మంత్రి వాకిటి శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. శిలాఫలకంపై ప్రొటోకాల్ ప్రకారం సీఎం, మున్సిపల్ శాఖ మంత్రి పేరు లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు.
దీనిపై వివరణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమృత్ 2.0 కేంద్ర ప్రభుత్వ పథకం కింద ఒక్కో చెరువు సుందరీకరణ పనులకు రూ.6.28 కోట్ల చొప్పున నిధులు మంజూరైనట్లు తెలిపారు.
పరమేశ్వర స్వామి చెరువు, చెరువును ఆనుకొని ఉన్న రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అమరచింత పట్టణంలో రూ.3.14 కోట్లతో చెరువు సుందరీకరణ పనులకు భూమిపూజ చేశారు. ఏంఎసీ చైర్మన్ రహమతుల్లా, పరమేశ్, తులసీ యాదవ్, నల్లగుల్ల శీను పాల్గొన్నారు.
