- నిర్వహణ లోపంతో దగ్ధమవుతున్న కోట్ల విలువైన భారీ వాహనాలు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: భానుడి భగభగలు, భూమిలోంచి వస్తున్న వేడికి తోడు మెయింటెనెన్స్ సరిగా లేకపోవడంతో ఓపెన్‌కాస్టు గనుల్లో వెహికల్స్ కాలిపోతున్నాయి. సింగరేణికి రూ. కోట్లలో నష్టం కలుగుతోంది. కోల్ ప్రొడక్షన్లో కీలక పాత్ర పోషిస్తున్న ఓపెన్‌కాస్టు మైనింగ్‌లో షవల్స్, డంపర్లదే ప్రధాన పాత్ర. రూ. కోట్ల విలువైన వెహికల్స్ కాలిపోతుండడంతో కార్మికులు ప్రాణాలు అర చేతిలో పెట్టుకొని పని చేస్తున్నారు. ఈక్రమంలో సింగరేణి ఎలాంటి నివారణ చర్యలు తీసుకోకుండా అధికోత్పత్తిపైనే దృష్టి పెడుతోందనే విమర్శలున్నాయి.
కాలిపోతున్న వెహికల్స్..
సింగరేణిలో 18 ఓపెన్‌కాస్టు గనులు ఉన్నాయి. కంపెనీలో నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తిలో సింహ భాగం ఓసీలదే. వేసవిలో భానుడి ప్రతాపంతో ఓపెన్‌కాస్టు గనుల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఓసీల్లో 42 నుంచి 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం కామన్‌గా మారింది. ఇల్లెందు, కొత్తగూడెం, మణుగూరు, శ్రీరాంపూర్, ఆర్జీ, బెల్లంపల్లి, మందమర్రి ఏరియాల్లో మూసివేసిన అండర్ గ్రౌండ్ మైన్స్‌లను ఓసీలుగా మార్చి సింగరేణి బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. ఈ క్రమంలో పలు ఓసీల్లో కింది నుంచి సెగలతో కూడిన పొగలు వస్తుంటాయి. ఓ వైపు భానుడి భగభగలు, మరోవైపు పొగలతో కూడిన వేడి సెగలు వెహికల్స్ హీటెక్కుతున్నాయి. షార్ట్ సర్క్యూట్‌తో కాలిపోతున్నాయి. ఇటీవల మణుగూరు ఏరియాలో రూ.3 నుంచి రూ.5 కోట్ల విలువైన షావల్ కాలిపోయింది.
వెహికల్ లో నుంచి మంటలు, పొగలు రావడాన్ని గమనించిన మరో వెహికల్ ఆపరేటర్ వైర్లెస్ సెట్ ద్వారా సమాచారం ఇవ్వడంతో కాలిపోయిన షావల్ ఆపరేటర్ దూకేశాడు. లేదంటే సజీవ దహనమయ్యేవాడు. మణుగూరు ఏరియాలోని ఓసీల్లో తరుచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలా షావల్స్, డంపర్స్తో పాటు ఇతర వెహికల్స్ కాలిపోతుండడంతో కార్మికులు ఆందోళనకు గురవుతుండగా, సంస్థకు కోట్లలో నష్టం వాటిల్లుతోంది. మెయింటెనెన్స్ సరిగా లేకపోవడమే ప్రమాదాలకు కారణమని కార్మికులు వాపోతున్నారు.
మణుగూరు ఏరియాలోని పీవో ఓసీలో 2024లో ఓబీ కాంట్రాక్టర్‌కు చెందిన టిప్పర్ క్యాబిన్ నుంచి మంటలు వచ్చాయి. ఆపరేటర్ దూకేయడంతో ప్రాణాపాయం తప్పింది.
మణుగూరు ఏరియాలోని ఓసీలో సాని ట్రక్ టిప్పర్ నుంచి పొగలు వచ్చాయి. షార్ట్ సర్క్యూట్ తో క్యాబిన్లో నుంచి పొగలు రావడాన్ని ఆపరేటర్ గమనించాడు.
2024లో గోదావరిఖనిలోని ఓసీలో పని చేస్తున్న షావల్లో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు, పొగలు వచ్చాయి.
భూపాలపల్లి ఏరియాలో 2025లో వంద టన్నుల కెపాసిటీ ఉన్న డంపర్ షార్ట్‌సర్క్యూట్‌తో క్యాబిన్లో మంటలు రాగా, ఆపరేటర్ క్యాబిన్ నుంచి దూకేయడంతో ప్రాణాపాయం తప్పింది.
బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగూడ ఓసీలో 2025లో వంద టన్నుల కెపాసిటీ ఉన్న డంపర్ క్యాబిన్లో మంటలు, పొగలు రావడాన్ని గుర్తించిన ఆపరేటర్ దూకేసి ప్రాణాలు కాపాడుకున్నాడు.
భూపలపల్లి ఏరియా కేటీకేఓసీ–2లో 2023లో షార్ట్ సర్క్యూట్ తో3 క్యూబిక్ మీటర్ల కెపాసిటీ ఉన్న షావెల్ క్యాబిన్ లో నుంచి మంటలు, పొగలు రావడంతో ఆపరేటర్ అందులో నుంచి దూకడంతో తీవ్రగాయాలయ్యాయి.
బెల్లంపల్లి ఏరియాలో 2022లో లోడింగ్ టైంలో షావెల్ వెనుక భాగంలో మంటలు, పొగలు రావడంతో ఆపరేటర్ గుర్తించి అక్కడి నుంచి దూకేశాడు.
2021లో కేటీకే సెక్టార్–1 ఓసీ–1లో 3 క్యూబిక్ మీటర్ల కెపాసిటీ ఉన్న షావెల్ షార్ట్‌సర్క్యూట్‌కు గురైంది. మణుగూరు ఏరియాలో పీకే ఓసీలో 2021లో జరిగిన రోడ్ యాక్సిడెంట్లో 5 క్యూబిక్ మీటర్ల కెపాసిటీ ఉన్న షావెల్ షార్ట్ సర్క్యూట్‌తో కాలిపోయింది. దీంతో సంస్థకు రూ. 6 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు నష్టం వాటిల్లింది.
2021లో 5 క్యూబిక్ మీటర్ కెపాసిటీ ఉన్న షావెల్ కోల్ బెంచ్ వద్ద లోడింగ్ చేస్తుండగా కాలిపోయింది. ఆపరేటర్ పొగను గుర్తించి క్యాబిన్ నుంచి బయటకు దూకేశారు.
