నెంబర్ ప్లేట్ లేకపోతే.. బండ్లు సీజ్!

నెంబర్ ప్లేట్ లేకపోతే.. బండ్లు సీజ్!
  • రిజిస్ట్రేషన్ నెంబర్ లేని వెహికల్స్ తో నగరంలో చైన్ స్నాచింగులు, చోరీలు
  • పలుచోట్ల కొట్టేసిన బైకులతో దొంగతనాలు
  • క్రైమ్ కంట్రోల్ పై స్పెషల్ ఫోకస్ పెట్టిన పోలీసులు
  • గ్రేటర్ సిటీలో స్పెషల్ డ్రైవ్ చేపట్టి తనిఖీలు
  • ఇప్పటికే 250 బైకులు.. 16 కార్లు స్టేషన్లకు తరలింపు

హనుమకొండ, వెలుగు: వరంగల్ నగరంలో నెంబర్ ప్లేట్ లేని బండ్లు చక్కర్లు కొడుతున్నాయి. కొంతమంది ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకునేందుకు రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ తొలగిస్తుంటే, ఇంకొందరు చైన్ స్నాచింగులు, చోరీలు చేసేందుకు తీసేస్తున్నారు. మరికొందరు కొట్టుకొచ్చిన బండ్లు పోలీసులకు చిక్కొద్దనే ఉద్దేశంతో నెంబర్ ప్లేట్ తొలగించి దర్జాగా తిరుగుతున్నారు. ఇటీవల ఇలాంటి బండ్లతోనే నేరాలు జరిగినట్లు గుర్తించిన పోలీసులు నెంబర్ ప్లేట్ లేని వెహికల్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా వరంగల్ నగర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. నెంబర్ ప్లేట్ లేని వెహికల్స్ తోపాటు ట్యాంపరింగ్ చేసిన బండ్లను సీజ్ చేస్తున్నారు.

చాలాన్ల భయంతో కొందరు, చోరీలకు ఇంకొందరు

నగరంలో హనుమకొండ, వరంగల్, కాజీపేట ట్రాఫిక్ స్టేషన్లున్నాయి. ఈ స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్ రూల్స్ స్ట్రిక్ట్ గా అమలు చేసేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్, హెల్మెట్ లేకపోవడం, సిగ్నల్ జంపింగ్ తదితర ఉల్లంఘనల కింద ఫొటోలు తీసి చాలాన్లు విధిస్తున్నారు. కొన్నిచోట్ల ఆటోమెటిక్ గా ఫైన్ జనరేట్ అయ్యేలా కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. దీంతో కొంతమంది వాహనదారులు చాలాన్ల నుంచి తప్పించుకునేందుకు నెంబర్ ప్లేట్ ను తొలగిస్తున్నారు. 

ఇంకొందరు రిజిస్ట్రేషన్ నెంబర్ లోని ఒకట్రెండు అక్షరాలను మార్చి ట్యాంపరింగ్ చేస్తున్నారు. మరికొందరు బండి నెంబర్ పోలీసుల కెమెరాకు చిక్కొద్దనే ఉద్దేశంతో నెంబర్ ప్లేట్ కు మాస్కులు, రిబ్బన్లు తగిలిస్తున్నారు. ఓ వైపు ట్రాఫిక్ చాలాన్ల నుంచి తప్పించుకునేందుకు వాహనదారులు నెంబర్ ప్లేట్లను తీసేస్తుంటే. కొందరు దుండగులు బండ్ల నెంబర్ ప్లేట్ తొలగించి చోరీలకు పాల్పడుతున్నారు. ఇటీవల వరంగల్ శివనగర్ తోపాటు హనుమకొండ హంటర్ రోడ్డు, శాయంపేట తదితర ప్రాంతాల్లో నెంబర్ ప్లేట్ లేని వాహనాలతోనే  చైన్ స్నాచింగులు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. 

266 వెహికల్స్ సీజ్..

దొంగ బండ్లను పట్టుకోవడంతోపాటు నేరాల నియంత్రణకు వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ నెంబర్‌‌ప్లేట్ లేని వెహికల్స్ పై ఫోకస్ పెట్టాల్సిందిగా ఆఫీసర్లకు ఆదేశాలిచ్చారు. దీంతో హనుమకొండ, వరంగల్, కాజీపేట ట్రై సిటీ పరిధిలోని ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు నగరంలో స్పెషల్ రైడ్స్ నిర్వహిస్తున్నారు. సిటీ వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టి ఇప్పటివరకు 266 నెంబర్ ప్లేట్ లేని బండ్లను సీజ్ చేశారు. ఇందులో 16 కార్లు ఉండటం గమనార్హం. కాగా, పోలీస్ ఆఫీసర్లు సీజ్ చేసిన బండ్లకు నెంబర్ ప్లేట్ ఫిక్స్ చేసిన తర్వాతనే రిలీజ్ చేస్తున్నారు. 

ఇదిలాఉంటే కొంతమంది వాహనదారులు బైక్ కొనుగోలు చేసి నెలలు దాటుతున్నా రిజిస్ట్రేషన్ చేయించడం లేదు. దీంతో నెల రోజులు దాటినా రిజిస్ట్రేషన్ చేయించుకోని కొత్త బండ్లను కూడా పోలీసులు సీజ్ చేస్తున్నారు. ఎక్కువకాలంగా రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా తిరిగే వాహనాలను ఆర్టీఏకు రాసి, ఫైన్లు కూడా విధించేలా చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు స్పెషల్ డ్రైవ్ లో భాగంగా దొంగ బండ్లను కూడా గుర్తిస్తున్నారు. ఇటీవల హనుమకొండ ట్రాఫిక్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన వెహికల్ చెకింగ్ లో నాలుగు దొంగ బండ్లు పట్టుబడగా, వాటిని స్వాధీనం చేసుకుని సంబంధిత ఓనర్లకు అప్పగించారు. ఇప్పటివరకు 15 దొంగ బండ్లను గుర్తించి, వాటిని సంబంధిత ఓనర్లకు హ్యాండోవర్ చేశారు.  

థెఫ్ట్ వెహికల్స్ కూడా గుర్తిస్తున్నం..

నెంబర్ ప్లేట్ లేని వెహికల్స్ ను గుర్తించేందుకు నగరంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. నెంబర్ ప్లేట్ లేకపోయినా, నెంబర్ కనిపించకుండా చేసినా సీజ్ చేస్తున్నాం. ఇందులో భాగంగానే థెఫ్ట్ వెహికిల్స్ గుర్తిస్తున్నాం. రూల్స్ పాటించని వాహనదారులపై సీరియస్ యాక్షన్ తీసుకుంటాం.- టి.సత్యనారాయణ, ట్రాఫిక్ ఏసీపీ, వరంగల్