ప్రధానమంత్రి, సీఎంలు నిజాయితీగా ఉంటే సరిపోదు.. బ్యూరోక్రాట్స్ కూడా ఉండాలి : వెంకయ్య నాయుడు

ప్రధానమంత్రి, సీఎంలు నిజాయితీగా ఉంటే సరిపోదు.. బ్యూరోక్రాట్స్ కూడా ఉండాలి : వెంకయ్య నాయుడు

హైదరాబాద్ : ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు నిజాయితీగా ఉంటే సరిపోదని, బ్యూరోక్రాట్స్ కూడా అంతే నిజాయితీ, నిబద్దతతో పని చేయాలన్నారు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. అన్నీ స్థాయిల్లోనూ నిజాయితీగా, అంకితభావంతో పని చేసే అధికారులు ఇప్పుడు దేశానికి కావాలన్నారు. వివిధ స్థాయిల్లో నిజాయితీ, సమర్థులైన అధికారులతోనే అభివృద్ధి సాధ్యం అన్నారు. అభివృద్ధిలో ఇండియా ముందుకుపోతోందన్నారు. 

మాదాపూర్ దస్పల్లా హోటల్ లో నిలువెత్తు నిజాయితీ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, సినీ నటుడు మురళీమోహన్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. 

అనుకున్న సమయానికి పనులు జరగాలంటే నిజాయితీగా కష్టపడే ప్రభుత్వ అధికారులతోనే సాధ్యమవుతుందన్నారు వెంకయ్యనాయుడు. గ్రామీణ ప్రాంతాల్లోని అభివృద్ధిపై దృష్టి పెడితేనే దేశం బాగుపడుతుందని అభిప్రాయపడ్డారు. అట్టడుగు వర్గాల్లో అభివృద్ధి జరగాలంటే అధికారులు నిబద్ధతతో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. 

నిలువెత్తు నిజాయితీ పుస్తకం ఆవిష్కరించడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు వెంకయ్యనాయుడు. ఈ పుసక్తాన్ని తన ద్వారా ఆవిష్కరించడాన్ని తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. శ్రీ గూడపాటి సీతారామ స్వామి ఆదర్శప్రాయ జీవితాన్ని గడిపిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. నేటి యువతరం ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ పుస్తకాన్ని విపులంగా, అద్భుతంగా రాశారని చెప్పారు. 

తాను శాసనసభ్యుడిగా ఉన్నప్పటి నుంచి గూడపాటి సీతారామస్వామి తనకు తెలుసన్నారు. ఆ రోజుల్లోనే నిజాయితీతో కూడిన కష్టపడి పని చేసే మనస్తత్వం ఆయనది అన్నారు. సీతారామ జీవితచరిత్ర చదివితే ఆయన గొప్పతనం గురించి తెలిసిపోతుందన్నారు. ఇప్పటికీ తన గ్రామాన్ని మార్చిపోకుండా అభివృద్ధి చేస్తుండడం గొప్ప విషయం అన్నారు. కన్నతల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని మర్చిపోయినవాడు మానవుడే కాదన్నారు.