సివిల్ సర్వెంట్లు చట్టాలను సమర్థంగా అమలు చేయాలి

 సివిల్ సర్వెంట్లు చట్టాలను సమర్థంగా అమలు చేయాలి

ముషీరాబాద్, వెలుగు: సివిల్ సర్వీస్ ఆఫీసర్లు అంకితభావంతో పనిచేస్తే దేశం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. చట్టసభల్లో చేసే చట్టాలను సమర్థంగా అమలు చేస్తూ.. జనాలకు మెరుగైన సేవలు అందించాలని ఆయన సూచించారు. ‘నేషనల్ సివిల్ సర్వీస్ డే’ సందర్భంగా ఆదివారం బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 21 సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, రిటైర్డ్ అధికారులకు సన్మాన కార్యక్రమం జరిగింది. చీఫ్ గెస్టుగా హాజరైన వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. సివిల్ సర్వీసెస్​లో ఉన్న వారు సొసైటీ కోసం దూరదృష్టితో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాల్లో ప్రమాణాలు పడిపోతున్నాయని.. మంచి నాయకులను ఎన్నుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అఖిల భారత సివిల్ సర్వీస్ వ్యవస్థ అవసరమని గుర్తించి.. ఆ రోజుల్లోనే సర్ధార్​వల్లభ బాయ్ పటేల్ దీన్నీరూపకల్పన చేశారని గుర్తుచేశారు. దేశంలోని కోర్టుల తీర్పులు, సారాంశాలు ఆయా భాషల్లో జనాలకు అర్థమయ్యేలా వెల్లడించాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా ప్రయత్నాలు జరగాలన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్  గోపాలకృష్ణ, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఆఫీసర్లు తరుణ్ కుమార్, ధీరజ్ కుమార్, వివేకానంద, పద్మనాభయ్య, ఎన్వీఎస్ రెడ్డి, ఓయూ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ గణేశ్, 21 సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ కృష్ణ ప్రదీప్ పాల్గొన్నారు.