సెక్యులర్ పేరుతో సమాజంలో చీలికలు తేవొద్దు : మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

సెక్యులర్ పేరుతో  సమాజంలో చీలికలు తేవొద్దు : మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

హైదరాబాద్ సిటీ, వెలుగు: భారతీయ నాగరికతలో కళలు కేవలం వినోద సాధనాలు కావని, మానసిక వికాసానికి, ఆధ్యాత్మిక ఉన్నతికి దోహదపడే సోపానాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. శనివారం హైదరాబాద్​లోని భారతీయ విద్యా భవన్​లో శ్రీవాగ్దేవి కళా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నాదోపాసన’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ప్రతి సాయంత్రం గ్రామాల్లో సత్సంగాలు, హరికథలు వంటి సంప్రదాయాలను పునరుద్ధరించాలని పిలుపునిచ్చారు. 

యువత ఆధునికతను ఆహ్వానిస్తూనే తమ మూలాలను మర్చిపోకూడదని సూచించారు. హిందూ అన్నది ఒక జీవన, సాంస్కృతిక విధానమన్నారు. సెక్యులర్ పేరుతో భారతీయ జీవన విధానాన్ని వ్యతిరేకించడం, భారతీయ సమాజంలో చీలికలు తేవడం సరి కాదన్నారు. మల్లాది సోదరుల సంగీత వారసత్వాన్ని, వాగ్దేవి కళా సమితి చేస్తున్న సంస్కృతీ పరిరక్షణ యజ్ఞాన్ని ఈ సందర్భంగా ఆయన  అభినందించారు.