మహంకాళి పీఎస్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లుపై వేటు 

మహంకాళి పీఎస్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లుపై వేటు 

కొంతమంది పోలీసుల తీరుతో డిపార్ట్ మెంట్ కే చెడ్డపేరు వస్తోంది. పౌరులతో ఫ్రెండ్లీగా ఉండకుండా కొంతమంది పోలీసులు అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. విధి నిర్వహణలో విచక్షణ కోల్పోయి ఇష్టం వచ్చినట్లు దాడి చేస్తున్నారు. తెలిసి, తెలియక తప్పు చేసిన వారిని కఠినంగా దండిస్తున్నారు. తాజాగా సికింద్రాబాద్ లో ఇలాంటి ఘటన జరిగింది. 

సికింద్రాబాద్ : పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  రాణిగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లారీ అడ్డా వద్ద రాజు అనే వ్యక్తి.. డీసీఎం వాహనాన్ని పెట్టుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ నెల 21 తేదీ రాత్రి లారీ అడ్డా వద్ద రాజు పడుకున్నాడు. అప్పుడే అక్కడకు వచ్చిన మహంకాళి కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు.. రాజును వెళ్లమని చెప్పాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. సహనం కోల్పోయిన కానిస్టేబుల్... లాఠీతో రాజును ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. 

కానిస్టేబుల్ చేతిలో తీవ్రంగా దెబ్బలు తిన్న రాజు.. ఇంటికి వెళ్లి పడిపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు మహంకాళి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. రాజుపై దాడికి పాల్పడిన కానిస్టేబుల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం పద్మారావు నగర్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బాధితుడు రాజు చికిత్స పొందుతున్నాడు. 

కానిస్టేబుల్ వెంకటేశ్వర్లుపై సస్పెన్షన్ వేటు
ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసు ఉన్నతాధికారులు కానిస్టేబుల్ వెంకటేశ్వర్లుపై సస్పెన్షన్ వేటు వేశారు. విచారణ అనంతరం కానిస్టేబుల్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.