పద్మారావునగర్/ముషీరాబాద్/ భైంసా, వెలుగు: పెండ్లికి నిరాకరించిందనే కోపంతో ఓ యువకుడు 18 ఏండ్ల యువతిని పట్టపగలే గొంతుకోసి హత్యచేశాడు. ఈ ఘటన హైదరాబాద్ వారాసిగూడలో జరిగింది. ఇక, నిర్మల్ జిల్లా భైంసా టౌన్లో ఓ యువతి వేరొకరితో సన్నిహితంగా ఉంటున్నదన్న కోపంతో యువకుడు విచక్షణరహితంగా దాడిచేసి చంపేశాడు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన కాంతారావు, లక్ష్మి దంపతులు వారాసిగూడ బాపూజీనగర్హన్మాన్గుడి పక్కనున్న బిల్డింగ్‌లో అద్దెకు ఉంటున్నారు.
కాంతారావు మేస్ర్తీగా పని చేస్తుండగా.. లక్ష్మి కూలీ పనులకు వెళ్తుంది. వీరి పెద్ద కూతురు పవిత్ర(18) ఇంటర్ పూర్తి చేసి కంప్యూటర్ట్రైనింగ్తీసుకుంటున్నది. కాంతారావుకు వరుసకు బంధువు అయిన శ్రీకాకుళం వాసి ఉమాశంకర్(27) జవహర్‌నగర్ లో ఉంటూ టైల్స్ వేసే పని చేస్తున్నాడు. ఇతడికి కొంతకాలం కింద పవిత్రను ఇచ్చి పెండ్లి చేయాలని అనుకున్నారు. అయితే, మద్యానికి బానిసై సరిగ్గా పనికి వెళ్లకపోవడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. కొద్దిరోజుల కింద కాంతారావు తన కుటుంబంతో విజయవాడ వెళ్లి కనకదుర్గమ్మ దర్శనం చేసుకుని సోమవారం తిరిగి వచ్చాడు.
విషయం తెలుసుకున్న ఉమాశంకర్ మధ్యాహ్నం కాంతారావు ఇంటికి వెళ్లి.. తనకు చెప్పకుండా విజయవాడకు వెళ్లడంతో గొడవకు దిగాడు. అలాగే, పెండ్లికి నిరాకరించిందనే కోపంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో కుటుంబ సభ్యులంతా చూస్తుండగానే పవిత్ర గొంతులో కత్తితో పొడిచాడు. దీంతో కుప్పకూలిన పవిత్ర కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయింది. వెంటనే ఉమాశంకర్అక్కడి నుంచి పరారయ్యాడు. చుట్టుపక్కల వాళ్లు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. చిలకలగూడ ఏసీపీ శశాంక్ రెడ్డి, ఎస్ఐ సుధాకర్ స్పాట్‌కు చేరుకొని పరిశీలించారు.
పరారీలో ఉన్న నిందితుడు ఉమాశంకర్ కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్టు తెలిపారు.
భైంసాలో అనుమానంతో..
భైంసా మండలం కుంసర గ్రామానికి చెందిన అశ్విని(28) అనే వివాహిత కుటుంబ కలహాలతో గత కొంత కాలంగా భర్త, ఇద్దరు పిల్లలకు దూరంగా భైంసా టౌన్లో ఉంటున్నది. ఈ క్రమంలో భైంసాలోని అంబేద్కర్ నగర్ కు చెందిన నగేశ్ (29)తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా సహజీవనానికి దారి తీయగా.. పట్టణంలోని సంతోషిమాత కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఇటీవలే అశ్వినితో నగేశ్అదే కాలనీలో నిర్మల్హైవే పక్కన టీ షాపు పెట్టించాడు.
అయితే, అశ్విని మరోవ్యక్తితో సన్నిహితంగా ఉంటున్నదని అనుమానం పెంచుకున్న నగేశ్.. సోమవారంఆమెతో గొడవ పడి.. దాడికి దిగాడు. టీ షాపు వద్ద రాడ్, కత్తితో అశ్వినిపై విచక్షణరహితంగా దాడి చేసి చంపేశాడు. అశ్విని అరుపులు విని చుట్టు పక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. సీఐ గోపీనాథ్ ఘటనా స్థలానికి చేరుకొని నగేశ్‌ను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అశ్విని డెడ్ బాడీని
ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.
