రాజకీయాల్లోకి క్రికెట్ జట్టు కెప్టెన్.. ఆటకు గుడ్‌బై చెప్పినట్టేనా..?

రాజకీయాల్లోకి క్రికెట్ జట్టు కెప్టెన్.. ఆటకు గుడ్‌బై చెప్పినట్టేనా..?

క్రికెట్ నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేవారు చాలా అరుదుగా ఉంటారు. ఇప్పటివరకు ఈ లిస్టు చూసుకుంటే వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. సాధారణంగా క్రికెట్ లో విపరీతమైన క్రేజ్ ఉన్నవారు రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. రిటైర్మెంట్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ను ఘనంగా చాటుకోవాలని ఆరాటపడుతుంటారు. తాజాగా ఈ లిస్టులో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్ హాసన్ వచ్చి చేరాడు. రాజకీయాల్లోకి వెళ్తున్నట్టు అధికారికంగా ధ్రువీకరించాడు. 

బంగ్లాదేశ్ వెటరన్ క్రికెటర్ గా, కెప్టెన్ గా, ఆల్ రౌండర్ గా జాతీయ జట్టుకు ఎన్నో సేవలను అందించిన షకీబ్.. క్రికెట్ కెరీర్ దాదాపు ముగిసినట్టుగానే కనిపిస్తుంది. బంగ్లాదేశ్ 12వ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అయిపోయాడు. అవామీ లీగ్ నుండి తన నామినేషన్ ధృవీకరించబడిన తర్వాత, షకీబ్ తన సొంత జిల్లా మగురా-1 నియోజకవర్గం నుండి ఎన్నికల బరిలోకి దిగనున్నాడు.  జనవరి 7న ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. బంగ్లా క్రికెట్ లో షకీబ్ కు ఇండియన్ సచిన్ అనే ట్యాగ్ ఉంది. దాదాపు 15 ఏళ్లుగా ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 

బంగ్లాదేశ్ క్రికెట్ నుండి గతంలో మాజీ కెప్టెన్, ఫాస్ట్ బౌలర్ ముష్రాఫ్ ముర్తాజా గత ఎన్నికల్లో నరైల్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. బీసీబీ అధ్యక్షుడు నజ్ముల్ హసన్ కూడా 2009లో ఎంపీగా ఎన్నికయ్యారు. ఇటీవలే షకీబ్ తన రాజకీయ ప్రవేశం ఉంటుందని ఖాయం చేయడంతో అతడు భవిష్యత్తులో క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. షకీబ్ క్రికెట్ ప్రయాణం దాదాపుగా ముగిసిందని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో డిసెంబర్ లో జరగబోయే న్యూజీలాండ్ సిరీస్ ఆడతాడా..? లేదా అనే విషయం ఆసక్తికరంగా మారింది. 

ఇటీవలే ముగిసిన వన్డే ప్రపంచ కప్ 2023లో బంగ్లాదేశ్ జట్టుకు షకీబ్ సారధ్యం వహించినగా చెత్త ఆటతీరుతో విమర్శలు మూటకట్టుకుంది. ఆడిన 9మ్యాచ్ ల్లో కేవలం 2 విజయాలను మాత్రమే సొంతం చేసుకుంది.బలహీనమైన ఆఫ్గనిస్తాన్, శ్రీలంక జట్లపై ఈ రెండు విజయాలు వచ్చాయి. ఇక బ్యాటర్ గా, బౌలర్ గా షకీబ్ పూర్తిగా తేలిపోయాడు.