వర్సిటీల్లో ఏకపక్ష నిర్ణయాలు..ఆందోళన బాటలో అధ్యాపకులు, ఉద్యోగులు

వర్సిటీల్లో ఏకపక్ష నిర్ణయాలు..ఆందోళన బాటలో అధ్యాపకులు, ఉద్యోగులు

హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్లర్లు వివాదాలకు కేరాఫ్ గా మారుతున్నారు. పాలకమండళ్లల్లో ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. ఈ నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అధ్యాపకులు, ఉద్యోగులు ఆందోళన బాట పడుతున్నారు. 

వీసీలు చెప్పే మాటలు వినాలని.. వినకూడదని చేస్తున్న హెచ్చరికలు.. ధైర్యం చేసి వాటిపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకునే వరకు వెళ్లకపోవడం.. తదితర పరిణామాలతో ఏం చేయాలో దిక్కుతోచడం లేదని వర్సిటీ ఉద్యోగులు చెబుతున్నారు. వీసీల నిర్ణయాల వల్ల వర్సిటీల ప్రతిష్ట దిగజారిపోతుందని విద్యార్థి సంఘాల నేతలు కూడా  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఉస్మానియా, జేఎన్టీయూ,  తెలుగు యూనివర్సిటీ.. ఇలా అన్ని వర్సిటీల్లో పాలకమండళ్ల నిర్ణయాలపై వివాదాలు  కొనసాగుతున్నాయి. ఏడాదిన్నర కిందట ప్రభుత్వం పాలకమండళ్లను నియమించింది. వీటిల్లో సభ్యులు సమావేశాలకు రాకపోవడం.. ఒకవేళ హాజరైనా పట్టించుకోకపోవడంతో వర్సిటీలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని విద్యావేత్తలు చెబుతన్నారు. 

ఉస్మానియాలో అధ్యాపకుల బాండ్ పేపర్లపై దుమారం

ఉస్మానియా యూనివర్సిటీలో అధ్యాపకుల బాండ్ పేపర్ల వివాదం పెద్ద దుమారం రేపింది. ఈ నిర్ణయంపై రెండుసార్లు పాలక మండలి తీర్మానం చేసింది. దీంతో  పీహెచ్ డీ  ప్రవేశ పరీక్షలో తీసుకున్న నిర్ణయం ఓయూలో విద్యార్ధులు వర్సెస్ వీసీగా మారింది. చివరకు విద్యార్థుల ఆందోళనతో వీసీ దిగిరావాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

అదేవిధంగా జేఎన్టీయూలో విద్యార్థుల క్రెడిట్ బెస్ట్ డిటెన్షన్ వివాదం పాలకమండలి తీసుకున్న నిర్ణయాలపై విద్యార్థులు వర్సిటీ ముందు పెద్దఎత్తున ఆందోళన చేశారు. ఈ విధానం వల్ల తాము నష్టపోతామని విద్యార్థులు గవర్నర్ కు సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేశారు. గవర్నర్ ఆదేశాలతో బెస్ట్ డిటెన్షన్ విధానాన్ని జేఎన్టీయూ అధికారులు వెనక్కి తీసుకున్నారు. 

జేఎన్టీయూలో ఐఎస్టీ, ఇంజనీరింగ్ కాలేజీలను విలీనం చేస్తూ పాలక మండలి తీసుకున్న నిర్ణయాలను అధ్యాపకులే వ్యతిరేకిస్తున్నారు. ఇలాగే అన్ని యూనివర్సిటీలు ప్రతిసారి ఏదో ఒక వివాదస్పద నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థుల ఆగ్రహానికి గురవుతున్నారు.ఇంత జరుగుతున్నా వర్సిటీల వైపు ప్రభుత్వం తొంగిచూడటం లేదని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు.

కొత్త వీసీలు వచ్చిన తర్వాత కూడా వర్సిటీల్లో పరిస్థితులు మారడం లేదంటున్నారు. విశ్వవిద్యాలయాలను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం ఊతం ఇస్తున్నట్లు కనిపిస్తోందని విద్యార్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుట్రలో భాగంగానే  వర్సీటీల్లో వీసీలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు.