ఉపరాష్ట్రపతి హోదాను అవమానిస్తే సహించను

ఉపరాష్ట్రపతి హోదాను అవమానిస్తే సహించను
  •    ఉపరాష్ట్రపతి హోదాను అవమానిస్తే సహించను
  •    వ్యక్తిగతంగా ఇన్ సల్ట్ చేస్తే పట్టించుకోను: ధన్ ఖడ్
  •    తనను వెక్కిరించిన కల్యాణ్ బెనర్జీ, వీడియో తీసిన రాహుల్ గాంధీపై ఫైర్ 
  •    వారి సంస్కారానికే వదిలేస్తున్నానని వెల్లడి  
  •    సభలో గంట సేపు నిలబడి సంఘీభావం తెలిపిన బీజేపీ ఎంపీలు

న్యూఢిల్లీ:  ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగ్ దీప్ ధన్ ఖడ్ ను వెక్కిరిస్తూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ మిమిక్రీ చేసిన ఘటనపై బుధవారం పార్లమెంట్ లోపలా, బయటా పెను దుమారం రేగింది. ధన్​ ఖడ్​కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సంఘీభావం తెలుపుతూ, ప్రతిపక్ష ఎంపీల తీరును తప్పుపట్టారు. అయితే, ఎంపీల సస్పెన్షన్, పార్లమెంట్​లో భద్రతా వైఫల్యం ఘటనపై చర్చను పక్కదోవ పట్టించేందుకే బీజేపీ ఈ విషయంపై రాద్ధాంతం చేస్తోందంటూ ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలు విమర్శించాయి. 

బుధవారం రాజ్యసభ ప్రారంభం కాగానే చైర్మన్ ధన్​ఖడ్​కు మద్దతుగా బీజేపీ ఎంపీలు గంటపాటు సభలో నిలబడి నినాదాలు చేస్తూ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ధన్​ఖడ్ మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా తనను అవమానిస్తే భరిస్తా, కానీ ఉపరాష్ట్రపతి ఆఫీసును, రైతు సమాజాన్ని, తన వర్గాన్ని అవమానిస్తే మాత్రం సహించబోనన్నారు. మంగళవారం పార్లమెంట్ ఆవరణలో తృణమూల్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ మిమిక్రీ చేస్తుండగా.. మరో నేత (రాహుల్ గాంధీ) వీడియో తీస్తూ ప్రోత్సహించడం వారి సంస్కారానికే వదిలేస్తున్నానని అన్నారు. 138 ఏండ్ల చరిత్ర ఉందని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ మౌనం తన చెవుల్లో ధ్వనిస్తోందని ప్రతిపక్ష నేత ఖర్గేను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు. 

మోదీ కూడా చేశారుగా?: కల్యాణ్ బెనర్జీ 

ధన్​ఖడ్​ను తాను అనుకరిస్తూ మిమిక్రీ చేయడాన్ని ఎంపీ కల్యాణ్ బెనర్జీ బుధవారం సమర్థించుకున్నారు. ధన్ ఖడ్ అంటే తనకు చాలా గౌరవం ఉందన్నారు. ‘‘మిమిక్రీ అనేది ఒక కళ. ఎవరినీ హర్ట్ చేయాలని  అనుకోలేదు. మాక్ పార్లమెంట్ నిర్వహిస్తుంటే మిమిక్రీ చేశా. తనను ఉద్దేశించేనని ధన్ ఖడ్ అనుకుంటే నేనేమీ చేయలేను” అని బెనర్జీ చెప్పారు. ప్రధాని మోదీ సైతం 2014 నుంచి 2019 మధ్య లోక్ సభలో మిమిక్రీ చేశారన్నారు. అప్పుడు ఎవరూ 
సీరియస్ గా తీసుకోలేదన్నారు. 

భావప్రకటన హుందాగా ఉండాలె: ముర్ము 

ప్రతిపక్ష ఎంపీలు ఉపరాష్ట్రపతిని వెక్కిరించిన తీరు పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందని, కానీ అది హుందాగా ఉండాలని ద్రౌపది ముర్ము ఈ మేరకు బుధవారం ట్వీట్ చేశారు.  

ధన్ ఖడ్​ను వెక్కిరించడం బాధించింది: మోదీ 

ఉపరాష్ట్రపతి జగ్ దీప్ ధన్ ఖడ్ ను ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ వద్ద వెక్కిరిస్తూ నీచమైన డ్రామాలు ఆడటం తనను చాలా బాధించిందని ప్రధాని మోదీ చెప్పారు. బుధవారం ధన్ ఖడ్​తో ఆయన ఫోన్ లో మాట్లాడారు. ‘‘ఇరవై ఏండ్లుగా తాను కూడా ఇలాంటి ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని తెలిపారు. కొందరు ఎంపీలు చేసిన అవమానాన్ని పట్టించుకోనని, తన డ్యూటీ తాను నిర్వర్తిస్తానని ఉపరాష్ట్రపతి బదులిచ్చారు” అని ఈ మేరకు ఉపరాష్ట్రపతి ఆఫీసు ఒక ప్రకటనలో తెలిపింది.   

ఎంపీల సస్పెన్షన్​పై చర్చింట్లేదేం?: రాహుల్ 

‘పార్లమెంట్ కాంప్లెక్స్ వద్ద కూర్చున్న సస్పెండెడ్ ఎంపీలను నేను నా ఫోన్​తో వీడియో తీశాను. ఎవరిని, ఎవరు, ఎలా అవమానించారు? ఎంపీలు అక్కడ కూర్చున్నారు. నేను వీడియో తీశాను. అది నా ఫోన్ లోనే ఉంది. మీడియా మాత్రం ఏదేదో చూపిస్తోంది. ప్రధాని మోదీ కామెంట్స్ చేస్తున్నారు” అని రాహుల్  అన్నారు. ‘‘వాళ్లు మా ఎంపీలు 150 మందిని పార్లమెంట్ నుంచి బయటకు గెంటేశారు. దీనిపై మీడియాలో ఎక్కడా చర్చ జరగట్లేదు” అంటూ మీడియాను ఆయన తప్పుపట్టారు. 

మరో ఇద్దరు ఎంపీలపై వేటు

లోక్ సభ నుంచి బుధవారం మరో ఇద్దరు ఎంపీలు సస్పెన్షన్​కు గురయ్యారు. కేరళ కాంగ్రెస్(మణి) సభ్యుడు థామస్ చాజికడన్, కేరళ సీపీఎం ఎంపీ ఏఎం ఆరిఫ్ సభలోకి ప్లకార్డులు పట్టుకుని వచ్చి నిరసన తెలిపారు. దీంతో వారిద్దరిని సస్పెండ్ చేయాలంటూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. దీంతో లోక్ సభలో సస్పెన్షన్​కు గురైన ఎంపీల సంఖ్య 97కు చేరింది. ఈ వింటర్ సెషన్ లో పార్లమెంట్ ఉభయసభల నుంచి సస్పెండ్ అయిన మొత్తం ఎంపీల సంఖ్య 143కు పెరిగింది.

లోక్ సభలో క్రిమినల్ కోడ్ బిల్లులు పాస్ 

క్రిమినల్ చట్టాల స్థానంలో కొత్త చట్టాలను తెచ్చేందుకు ప్రవేశపెట్టిన బిల్లులకు లోక్ సభ బుధవారం ఆమోదం తెలిపింది. ఇండియన్ పీనల్ కోడ్(1860), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (1973), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ (1872)ల స్థానంలో కొత్త చట్టాలను తెచ్చేందుకు రూపొందించిన భారతీయ న్యాయ సంహిత (2023), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (2023), భారతీయ సాక్ష్య (2023) బిల్లులు సభలో ఆమోదం పొందాయి.