దళితుల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కించపర్చారు : మల్లు రవి

దళితుల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కించపర్చారు : మల్లు రవి

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జి.సాయన్న అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో చేయకపోవడం దళితుల ఆత్మగౌరవాన్ని కించపరచడమే అని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి అన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందంటూ మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి, పదవుల్లో లేని వారికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం..దళిత నేత, మచ్చలేని నాయకుడి అంత్యక్రియల పట్ల నిర్లక్ష్యం వహించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సాయన్నను నిర్లక్ష్యం చేయడం కేసీఆర్ ప్రభుత్వానికి దళితుల పట్ల ఉన్న చిన్న చూపునకు ఒక నిదర్శనం అని చెప్పారు. ‘దళితబంధు అంటూ దగా చేయడం.. అంబేద్కర్ విగ్రహాలు అంటూ మోసం చేయడం కాదు.. దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడాలి’ అంటూ మల్లు రవి చెప్పారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేసీఆర్ తీరును దళితులు అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు. 

నిన్న అధికారిక లాంఛనాలతో ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు నిర్వహించకపోవడంతో ఆయన అనుచరులు, అభిమానులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ తీరును శ్మశానవాటిక వద్ద ఎండగట్టారు. ఆ సమయంలో అక్కడే ఉన్న మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డిని నిలదీశారు. దీంతో మంత్రులు సమాధానం చెప్పలేక వెనక్కి వెళ్లిపోయారు. చివరకు అభిమానులకు సాయన్న కుటుంబసభ్యులు నచ్చజెప్పి అంత్యక్రియలు నిర్వహించారు.