ఇండియా కూటమి నుంచి ఉప రాష్ట్రపతి అభ్యర్థి.. పోటీలో నిలబెట్టనున్న కూటమి నేతలు

ఇండియా కూటమి నుంచి ఉప రాష్ట్రపతి అభ్యర్థి.. పోటీలో నిలబెట్టనున్న కూటమి నేతలు

న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఇండియా కూటమి తన అభ్యర్థిని నిలబెట్టనుంది. ఉప రాష్ట్రపతి అభ్యర్థిపై కూటమి నేతలు.. రాజ్యసభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్  చీఫ్​ మల్లికార్జున ఇంట్లో సోమవారం రాత్రి భేటీ అయ్యారు. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో మరికొందరు కూటమి నేతలు వర్చువల్ గా జాయిన్  అయ్యారు. 

ఉప రాష్ట్రపతి పదవికి పోటీలో ఎవరిని నిలబెడితే బాగుంటుందన్న అంశంపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు. అయితే.. రాజకీయాలకు సంబంధంలేని, జాతీయవ్యాప్తంగా గుర్తింపు ఉన్న వ్యక్తిని అభ్యర్థిగా నిలబెడితే బాగుంటుందని పలువురు నేతలు సూచించారు. తమిళనాడుకు చెందిన, ఇండియన్  స్పేస్  రీసర్చ్  ఆర్గనైజేషన్ (ఇస్రో) సైంటిస్ట్  పేరును డీఎంకే నేతలు ప్రతిపాదించినట్లు సమాచారం.

 అలాగే, డీఎంకే సీనియర్  లీడర్  తిరుచి శివ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఈ విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. శివ అభ్యర్థిత్వంపై ఇతర లీడర్లతో చర్చలు జరపాల్సి ఉంది. తన అభ్యర్థిత్వంపై తానేమీ మాట్లాడబోనని, ఆ విషయం పార్టీ హైకమాండ్  నిర్ణయిస్తుందని శివ తెలిపారు. 

రాధాకృష్ణన్​కు వైసీపీ మద్దతు

మరోవైపు ఉప రాష్ట్రపతి ఎన్నికను ఏకీగ్రవం చేసేందుకు అధికార ఎన్డీఏ కూటమి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్  సింగ్  సోమవారం పలువురు ప్రతిపక్ష నేతలను సంప్రదించారు. ఆయన కలిసిన వారిలో రాజ్యసభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్  చీఫ్‌‌  మల్లికార్జున ఖర్గేతో పాటు వైసీపీ అధినేత వైఎస్  జగన్  కూడా ఉన్నారు. 

తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ఆ ఇద్దరినీ రాజ్ నాథ్  కోరారు. దీంతో ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని వైసీపీ నిర్ణయించింది. కాగా.. ఉప రాష్ట్రపతి పదవికి తమ తరపున మహారాష్ట్ర గవర్నర్  సీపీ రాధాకృష్ణన్ ను ఎన్డీఏ ఇదివరకే ప్రకటించింది.