రేషన్ షాపు ముందు బాధితుల ధర్నా

రేషన్ షాపు ముందు బాధితుల ధర్నా

మెట్ పల్లి, వెలుగు: మేం చనిపోయినట్లు రేషన్ కార్డులో పేర్లు తొలగించారు, కానీ మేం చనిపోలేదు. మాకు బియ్యం ఇయ్యున్రి సారూ.. అంటూ జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం కొండ్రికర్ల గ్రామంలో బాధితులు రేషన్ షాపు ముందు ఆందోళనకు దిగారు. కొండ్రికర్ల గ్రామానికి చెందిన ముస్కు రాజవ్వ, ఆకుల చిన్న గంగారం, మాకూరి లక్ష్మి, సంకు లక్ష్మి,  మెండే భూలక్ష్మి, సకినాల గంగు తదితరులు ప్రతి నెలా రేషన్ బియ్యం తీసుకొని అవే తింటూ జీవిస్తున్నారు. ఈ నెల బియ్యం కోసం రేషన్ షాపునకు వెళ్లగా కార్డులో వీరి పేర్లు తొలగించినట్లు డీలర్ చెప్పాడు. ఎందుకు తొలగించారో ఆన్ లైన్ లో స్టేటస్ చెక్ చేయగా వీరంతా చనిపోయినట్లు నమోదై ఉందని తెలిసింది. దీంతో మేము బతికే ఉన్నాం, చనిపోయినట్లు ఎలా నమోదు చేస్తారంటూ బాధితులు సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాము చనిపోయామని తప్పుడు రికార్డులు నమోదు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, తమకు వెంటనే బియ్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రేషన్ షాపు ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆకుల రాజగంగు మాట్లాడుతూ వీరితోపాటు చాలామంది పేర్లు రేషన్ కార్డుల నుంచి తొలగించినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి జరిగిన తప్పిదాన్ని సరిదిద్దుకోవాలన్నారు. బాధితులకు వెంటనే రేషన్ బియ్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మెట్ పల్లి పట్టణంలో సుమారు 200 మంది పేర్లను చనిపోయారంటూ రేషన్ కార్డుల నుంచి తొలగించినట్లు సమాచారం. ఈ విషయమై మెట్ పల్లి ఇన్​ఛార్జి తహసీల్దార్ రాజ్ మొహమ్మద్ ను వివరణ కోరగా సాంకేతిక సమస్యల వల్ల కొన్ని పేర్లు డిలీట్ అయ్యాయన్నారు. పేర్లు డిలీట్ అయినవారు సంబంధిత రేషన్ షాపునకు వెళ్లి ఈ పాస్ మిషన్ లో వేలిముద్ర వేస్తే పేర్లు మళ్లీ యాడ్ అవుతాయని చెప్పారు.