బీఆర్ఎస్ లీడర్లు కబ్జా చేశారని ఆందోళన

 బీఆర్ఎస్ లీడర్లు కబ్జా చేశారని ఆందోళన

బెల్లంపల్లి, వెలుగు: తమ భూమిని బీఆర్ఎస్ లీడర్లు కబ్జా చేశారని పట్టణానికి చెందిన ఓ కుటుంబ సభ్యులు శనివారం   ఎమ్మెల్యే  క్యాంప్​ ఆఫీస్​ దగ్గరున్న ట్యాంక్​ ఎక్కి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబీకులు మాట్లాడారు.  ఆవుల కొమురయ్య, తడక రవి అనే బీఆర్​ఎస్​ నాయకులు తమ భూమి కబ్జా చేశారని,  అడిగితే చంపుతామని బెదిరిస్తున్నారని చెప్పారు.   తమకు బెల్లంపల్లి పట్టణంలోని రాంనగర్ లో గల 170 పీపీలో  ఐదు ఎకరాల భూమి ఉందని,   కొంత భూమిలో పోలీస్ శాఖ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయగా మిగితా భూమి తమదేనన్నారు.  దాన్ని కొమురయ్య, రవి  కబ్జా చేసి, ఇతరులకు  అమ్ముకుంటూ  అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. తాము బీఆర్ఎస్  లో పని చేస్తున్నప్పటికీ.. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో సహా పెద్ద లీడర్లకు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. ఆందోళన చేస్తున్న క్రమంలో  తేనేటీగల గుంపు వారిపై  దాడి  చేసింది. గమనించిన వారి బంధువు డోలి సాయి హుటాహుటిన వాటర్ ట్యాంక్ ఎక్కగా అతనిపైనా  తేనేటీగలు దాడి చేశాయి. విషయం తెలుసుకున్న బెల్లంపల్లి వన్ టౌన్  సీఐ టి. శంకరయ్య, రూరల్ సీఐ రాజ్ కుమార్ గౌడ్, టూ టౌన్ ఎస్సై ఆంజనేయులు అక్కడికి  చేరుకున్నారు.  పోలీస్ సిబ్బంది అంజయ్య, ప్రభాత్ మరికొంతమంది ట్యాంక్ ఎక్కించి ఆందోళనకారులకు నచ్చజెప్పి కిందికి దించారు. తేనెటీగల దాడితో అస్వస్థతకు గురైన సుకుమార్, అతని కొడుకు అజయ్ తేజ, బంధువు సాయిలను పోలీస్ లు  స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. సాయి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.