Irani Trophy 2025: దేశమంతా కలిసినా ఓడింది: ఇరానీ ట్రోఫీ విజేత విదర్భ.. ఫైనల్లో రెస్టాఫ్ ఇండియా ఓటమి

Irani Trophy 2025: దేశమంతా కలిసినా ఓడింది: ఇరానీ ట్రోఫీ విజేత విదర్భ.. ఫైనల్లో రెస్టాఫ్ ఇండియా ఓటమి

ఇరానీ ట్రోఫీ విజేతగా విదర్భ నిలిచింది. ఆదివారం (అక్టోబర్ 5) ముగిసిన ఫైనల్లో రెస్టాఫ్ ఇండియాపై 93 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి టైటిల్ అందుకుంది. 361 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రెస్ట్ ఆఫ్ ఇండియా చివరి రోజు రెండో సెషన్‌లో 267 పరుగులకు ఆలౌట్ అయింది. స్పిన్నర్ హర్ష్ దుబే (4/73), పేసర్ యశ్ ఠాకూర్ (2/47) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. తొలి ఇన్నింగ్స్ లో భారీ సెంచరీతో సత్తా చాటిన అథర్వ తైడేకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.  

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన విదర్భ 342 పరుగులకు ఆలౌటైంది. అథర్వ తైడే (143) సెంచరీతో సత్తా చాటగా యష్ రాథోడ్ 91 పరుగులు చేసి రాణించాడు. మిగిలిన వారు ఎవరూ పెద్దగా రాణించలేదు. రెస్టాఫ్ ఇండియన్స్ బౌలర్లలో ఆకాష్ దీప్, మానవ సుతార్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన రెస్టాఫ్ ఇండియా 214 పరుగులకే ఆలౌట్ అయింది. పటిదార్ 66 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిస్తే.. అభిమన్యు ఈశ్వరన్ 52 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. విదర్భ బౌలర్లలో యష్ ఠాకూర్ నాలుగు వికెట్లు తీసి సత్తా చాటాడు.

తొలి ఇన్నింగ్స్ లో 128 పరుగుల ఆధిక్యంతో బరిలోకి దిగిన విదర్బ రెండో ఇన్నింగ్స్ లో 232 పరుగులకు ఆలౌట్ అయింది. అమన్ మోఖడే 37 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. కంబోజ్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. 361 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రెస్ట్ ఆఫ్ ఇండియా 267 పరుగులకు ఆలౌట్ అయింది. స్పిన్నర్ హర్ష్ దుబే నాలుగు వికెట్లు పడగొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. పటిదార్ కెప్టెన్సీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ టైటిల్.. ఆ తర్వాత దులీప్ ట్రోఫి గెలుచుకుంది. అయితే ఇరానీ ట్రోఫీలో మాత్రం పటిదార్ కెప్టెన్సీలోనిరాశే మిగిలింది.