
గణేష్ చతుర్థి పండుగకు ముందు కర్ణాటకలోని బెంగళూరులోని ఒక ఆలయాన్ని రూ. 2 కోట్ల విలువైన కరెన్సీ నోట్లు, నాణేలతో అలంకరించారు. జేపీ నగర్‌లోని శ్రీ సత్యగణపతి దేవాలయం ప్రతి సంవత్సరం గణేష్ పూజ ఉత్సవాల సమయంలో ప్రాంగణానికి ప్రత్యేకమైన టచ్ ఇవ్వడంతో ప్రసిద్ది చెందింది. ఈసారి, వారు ఒక అడుగు ముందుకేసి, వందలాది నాణేలు, రూ. 10, రూ. 20, రూ. 50 నుండి రూ. 500 డినామినేషన్ల వరకు కరెన్సీ నోట్లను ఉపయోగించి ఆలయాన్ని అలంకరించారు.
ఆలయ అలంకరణ కోసం రూ.2 కోట్ల 18లక్షల విలువైన కరెన్సీ నోట్లు, రూ. 70 లక్షల విలువైన నాణేలను ఉపయోగించారు. దీన్ని సిద్ధం చేయడానికి మూడు నెలల సమయం పట్టిందని ఆలయ ధర్మకర్త మోహన్ రాజు ట్రస్టీ తెలిపారు. ఏ నాణేలు, కరెన్సీ నోట్లు వాడినా వాటిని ఆలయానికి ఇచ్చిన వారికే తిరిగి ఇస్తామని చెప్పారు.
గత కొన్ని సంవత్సరాలలో, గణపతి చతుర్థి ఉత్సవాల్లో భాగంగా గణపతి విగ్రహాన్ని అలంకరించేందుకు ఆలయంలో పువ్వులు, మొక్కజొన్న, పచ్చి అరటిపండ్లు వంటి పర్యావరణ అనుకూల వస్తువులను కూడా ఉపయోగించారు.