
కర్ణాటక కాంగ్రెస్ కార్యకర్త ఓ పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తున్న మహిళపై కరెన్సీ నోట్ల వర్షం కురిపిస్తున్న వీడియో వివాదాస్పదంగా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో తీవ్ర విమర్శలు చేసిన బీజేపీ.. ఆ మహిళకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తోంది.
కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలో ఓ వివాహ వేడుకలో భాగంగా జరిగిన హల్దీ వేడుకలో ఈ ఘటన జరిగింది. ఈ వీడియోలో హుబ్లీకి చెందిన శివశంకర్ హంపన్న అనే కాంగ్రెస్ కార్యకర్త మహిళ పక్కన డ్యాన్స్ చేస్తూ ఆమెపై డబ్బు విసురుతున్నాడు. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో బీజేపీ తప్పబడుతోంది.
ఈ ఘటన సిగ్గుచేటని కర్ణాటక బీజేపీ ప్రధాన కార్యదర్శి మహేశ్ టెంగింకై అన్నారు. ఇలాంటి వ్యక్తులకు డబ్బు విలువ తెల్వదని..ఇలాంటి ఘటనల వల్లే కాంగ్రెస్ సంస్కృతి ఏంటో అర్థమవుతోందని విమర్శించారు.
బీజేపీ అధికార ప్రతినిధి రవినాయక్ కూడా కాంగ్రెస్ పై తవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ మహిళలకు ఇస్తున్న గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. పెళ్లి పీఠలపై డబ్బులు విసిరే సంస్కృతి కాంగ్రెస్ నేతలకు మాత్రమే ఉంటుందని ఆరోపించారు ఒక రాజకీయ నాయకుడు ఇలా చేయడం తప్పని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్త వెంటనే ఆ మహిళకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటన మహిళలను పూర్తిగా అగౌరవ పరిచేలా ఉందన్నారు.