విద్యా వ్యవస్థను మెరుగుపర్చాలి : వేముల రామకృష్ణ

విద్యా వ్యవస్థను మెరుగుపర్చాలి : వేముల రామకృష్ణ

ముషీరాబాద్, వెలుగు: అన్ని వర్గాల అభివృద్ధి విద్యతోనే సాధ్యమంటున్న ప్రభుత్వాలు, విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నాయా అని బీసీ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ప్రశ్నించారు. విద్యాసంస్థలను పరిరక్షించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉందన్నారు. ఆదివారం విద్యానగర్ లోని బీసీ విద్యార్థి సేన స్టేట్​ఆఫీసులో ‘విద్యార్థుల సమస్యలు– పరిష్కారం’ అనే అంశంపై విద్యార్థి సంఘాల సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా వేముల రామకృష్ణ మాట్లాడుతూ..  సంతలో సరుకులా విద్య కార్పొరేట్ మయం అవుతోందని, కాపాడాల్సిన ప్రభుత్వాలే పెంచి పోషిస్తున్నాయని విమర్శించారు. ఉన్నోడికి ప్రత్యేకమైన కోర్సులు.. లేనోడికి సాధారణ విద్యను కొనసాగించడం దారుణం అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు గొప్పగా బతకాలని అప్పులు చేసి మరీ కార్పొరేట్ కాలేజీల్లో చేర్పిస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ఫీజు దోపిడీని అరికట్టాలని కోరారు. విద్య గ్యారెంటీ అనే పథకాన్ని తీసుకువచ్చి దేశ వ్యాప్తంగా విద్యా వ్యవస్థను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో విద్యార్థి నాయకులు పృధ్వీగౌడ్, కమల్, విశాల్, వంశీ, అరుణ్, వినోద్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.