
- అదనంగా 10% ఫ్రీ పాస్‌ల కోసం హెచ్‌సీఏ ఒత్తిడి!
- విజిలెన్స్ విచారణలో వెల్లడి
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ), -ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) మధ్య తలెత్తిన టికెట్ల వివాదంలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ తుది దశకు చేరుకున్నది. ఉప్పల్ స్టేడియంలో గత నెల జరిగిన ఐపీఎల్ టీ20 టికెట్లు, ఫ్రీ పాసుల కేటాయిపులకు సంబంధించిన ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఐపీఎల్ నిర్వహణ కోసం హెచ్‌సీఏ, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య కుదుర్చుకున్న ఒప్పందంలో పేర్కొన్న టికెట్ల కంటే 10 శాతం అదనంగా ఇవ్వాలని హెచ్‌సీఏ ఒత్తిడి చేసినట్లు నివేదికలో వెల్లడించినట్టు తెలిసింది.
టికెట్ల వివాదంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని మార్చి 31న సీఎం రేవంత్‌రెడ్డి విజిలెన్స్ అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు విజిలెన్స్ డీజీ శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో 2 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి దాదాపు 10 రోజుల పాటు విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.
ఫ్రీ పాసుల వివాదంపైనే నివేదిక
హెచ్‌సీఏ సభ్యుల సమక్షంలోనే ఐపీఎల్ అగ్రిమెంట్లకు సంబంధించిన రికార్డులను విజిలెన్స్ అధికారులు పరిశీలించారు. హెచ్‌సీఏ సెక్రటరీ దేవరాజు, జాయింట్ సెక్రటరీ బస్వరాజు, ట్రెజరర్ సీజే శ్రీనివాస్‌ను ప్రశ్నించారు. ఆ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ సీఈవో షణ్ముగం, ప్రతినిధులు కిరణ్, శరవణన్, రోహిత్ సురేశ్ నుంచి వివరాలు సేకరించారు. 2013 నుంచి ఐపీఎల్ నిర్వహణకు అనుసరిస్తున్న పద్ధతులు, టిక్కెట్ల పంపిణీ, స్టేడియంలో వసతులు కల్పించడం, ఫ్రీ పాసుల కేటాయింపులు సహా వివాదానికి కారణమైన అన్ని అంశాలపై వివరాలు సేకరించారు. ఆఫీస్ బేర్లర్ల అందించిన సమాచారాన్ని స్టేట్‌మెంట్ల రూపంలో రికార్డ్ చేశారు. ఈ మేరకు ప్రాథమిక నివేదికలో కీలక వివరాలను వెల్లడించినట్లు తెలిసింది.