అతితెలివి వాడిన అవినీతి ఏఎస్ఐ.. అరెస్ట్ తప్పించుకునేందుకు డబ్బు గాల్లోకి విసిరాడు.. ట్విస్ట్ ఇదే..

అతితెలివి వాడిన అవినీతి ఏఎస్ఐ.. అరెస్ట్ తప్పించుకునేందుకు డబ్బు గాల్లోకి విసిరాడు.. ట్విస్ట్ ఇదే..

ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ ప్రజలకు సేవకోసం పనిచేయాల్సిన కొందరు అవినీతి అధికారులు లంచాలు డిమాండ్ చేస్తున్నారు. ఇలా అవినీతికి పాల్పడుతున్న వారిని పట్టుకుంటున్నట్లు రోజూ వార్తల్లో వినిపిస్తున్నప్పటికీ.. ఒక్కరిలో కూడా మార్పు రావటం లేదు. పైగా తాము దొరకలేదుగా అనుకుని తమ ఆమ్యామ్యాల అలవాటును కొనసాగిస్తున్నారు. 

తాజాగా ఢిల్లీలో జరిగిన ఒక సీన్ చూస్తే అచ్చం సినిమాలో చూసినట్లుందే అనిపిస్తుంది. నగరంలోని హౌజ్ క్వాజీ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నారు అసిస్టెంట్ సబ్ ఇన్పెక్టర్ రాజేష్ కుమార్. కేసు విషయంలో తన వద్దకు వచ్చిన వ్యక్తి నుంచి రాజేష్ 15వేల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు విజిలెన్స్ అధికారులను సంప్రదించి పోలీసు అధికారి తీరుపై కంప్లెయింట్ చేశాడు. దీంతో ఈ లంచాధికారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేందుకు ట్రాప్ రెడీ చేశారు అధికారులు.

ముందుగా ప్లాన్ చేసుకున్నట్లుగానే ఏఎస్ఐ కోరిన రూ.15వేలను 500 నోట్ల రూపంలో ఇచ్చేందుకు వెళ్లాడు బాధితుడు. కరెక్టుగా డబ్బు చేతిలో పెట్టగానే అతడిని పట్టుకునేందుకు విజిలెన్స్ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. దీంతో అతితెలివి వాడిన రాజేష్ వెంటనే చేతిలోని డబ్బును గాల్లోకి విసిరేశాడు. పక్కన ఉన్న ప్రజలు వెంటనే డబ్బు దొరికిన కాడికి పట్టుకుని వెళ్లిపోయారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చిన విజిలెన్స్ టీం వెంటనే మిగిలిన డబ్బును రికవర్ చేసి ఆధారాలను సేకరించి సదరు అధికారిని అరెస్ట్ చేశారు. అవినీతి నిరోధక చట్టం ప్రకారం ప్రస్తుతం అతనిపై కేసు ఫైల్ అయ్యింది.