హీరో విజయ్ ఆంటోనీకి గాయాలు, ఆస్పత్రికి తరలింపు

హీరో విజయ్ ఆంటోనీకి గాయాలు, ఆస్పత్రికి తరలింపు

బిచ్చగాడు ఫేమ్ హీరో విజయ్ ఆంటోనీకి మలేషియాలో ప్రమాదం జరిగింది. కౌలాలంపూర్‌ లో బిచ్చగాడు-2 కోసం ఓ యాక్షన్ సీన్‌ని చిత్రీకరిస్తుండగా విజయ్ కు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. వాటర్ బోట్‌ ఛేజింగ్ సీన్‌ని షూట్ చేస్తుండగా.. బోట్అదుపు తప్పి, చిత్ర యూనిట్ ఉన్న పెద్ద బోట్‌ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఈ ఘటనలో విజయ్ ఆంటోని గాయపడడంతో.. వెంటనే అతన్ని కౌలాలంపూర్‌లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో పిచ్చైక్కారన్‌–2 (బిచ్చగాడు-2) మూవీ కొన్ని రోజులు వాయిదాపడనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ మూవీకి విజయ్ ఆంటోనీనే దర్శకుడు కావడంతో చిత్ర బృందం ఆందోళన చెందుతోంది.

ఈ విషయాన్ని నిర్మాత ధనంజయన్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ప్రమాదంలో జరిగిన గాయం నుండి విజయ్ ఆంటోనీ త్వరగా కోలుకుంటున్నాడని తెలిపారు. ప్రస్తుతం అతన్ని అబ్జర్వేషన్ లో ఉంచారని చెప్పారు. త్వరలోనే చెన్నైకి తీసుకురావడానికి ప్రయత్నాలు సాగుతున్నాయని స్పష్టం చేశారు.